
రెడ్ బుక్ పాలనకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు
బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ విభాగం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు పోలూరి వెంకటరెడ్డి
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): అక్రమ కేసుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు కూటమి రెడ్‌బుక్ పాలనకు అడుగులకు మడుగులు ఒత్తుతున్న పోలీసులకు ఒక చెంపపెట్టు లాంటిదని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ విభాగం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు పోలూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు. గుంటూరు అరండల్‌పేటలోని ఆయన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో వెంకటరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు.. అనే దానికి తురకా కిషోర్ ఉదంతం ఒక ఉదాహరణ అని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా, పౌరహక్కులు నిలబెట్టేలా కిషోర్‌ను విడుదల చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వటం గొప్ప పరిణామం అన్నారు. పోలీసు వ్యవస్థ పొలిటికల్ బాస్‌ల చేతిలో కీలుబొమ్మల్లా మారిపోయిందని ధ్వజమెత్తారు. వాస్తవానికి తురకా కిషోర్‌ను 2022లో జరిగిన సంఘటనకు సంబంధించి అరెస్ట్ చేశాక, అనేక అక్రమ కేసులు బనాయించారన్నారు. కేవలం వైఎస్సార్ సీపీకి చెందిన వ్యక్తి అనే దురుద్దేశంతో 210 రోజులకుపైగా జైల్లో పెట్టారని మండిపడ్డారు. కిషోర్‌ను మానసికంగా, శారీరకంగా వేధించారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టు ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను కాపాడాలనే ఉద్దేశంతో చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందని అన్నారు. సామాన్యుల హక్కులను కాలరాసే విధంగా అరాచక పాలన చేస్తున్న కూటమికి హైకోర్టు తీర్పు చెంప చెళ్లుమనిపించేలా ఉందన్నారు. అక్రమ అరెస్టులపై వైఎస్సార్ సీపీ లీగల్ విభాగం బాధితుల పక్షాల అన్ని విధాలుగా పోరాడుతోందని, బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామన్నారు. జ్యుడిషీయల్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి న్యాయమూర్తులు రిమాండ్ విధించేటప్పుడు రికార్డులు సరిగ్గా పరిశీలించటం లేదనే విషయాన్ని హైకోర్టు ఎత్తి చూపటం జరిగిందన్నారు.
సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్‌లైన్స్ పాటించాలి..
ఇప్పటికై నా ఆయా న్యాయమూర్తులు కేసు పూర్వాపరాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని, యాంత్రికంగా వ్యవహరించటం సరికాదన్నారు. సుప్రీం, హైకోర్టు గైడ్‌లైన్స్ పాటించాల్సిన బాధ్యత మెజిస్ట్రేట్‌లపై ఉందన్న విషయాన్ని తెలియజేస్తామన్నారు. ఏదో పోలీసులు తెచ్చారు.. రిమాండ్ విధిద్దాం.. అనే ధోరణిలో కాకుండా వాస్తవాలను పరిశీలించాలని విన్నవించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు పూర్తిస్థాయిలో అండగా లీగల్ విభాగం ఉంటుందని, వారిని అన్ని విధాలుగా సహాయం అందజేస్తామన్నారు. తురకా కిషోర్‌పై ఇప్పటివరకు 18 అక్రమ కేసులు పెట్టారన్నారు. ఎల్లకాలం కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండదన్న విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.