
తెనాలిలో విజిలెన్స్ అధికారుల దాడులు
తెనాలిటౌన్: అనుమతిలేని విత్తనాలను తెలంగాణ రాష్ట్రం నుంచి తెచ్చి తెనాలి ప్రాంతంలో అమ్మకాలు జరుపుతున్న ఎరువులు, విత్తనాల షాపులపై గురువారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మెరుపుదాడి చేసి భారీగా వరి విత్తనాలను సీజ్ చేశారు. స్థానిక నందులపేటలోని వినాయక ఎంటర్ ప్రైజెస్ దుకారణంలో జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, వ్యవసాయాధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమతిలేని వరి విత్తనాలను తెలంగాణ నుంచి తెచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు. విత్తనాల నాణ్యతను పరీక్ష నిమిత్తం శాంపిల్స్ సేకరించి, ల్యాబ్ టెస్టింగ్‌కు పంపిచారు. డెల్టా ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తున్న వరిలో మేలురకం విత్తనాలను రైతులకు అందివ్వాలన్న దృక్పథంతో వరుసగా తెనాలి పరిసర ప్రాంతంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. రూ.5,85,300 విలువైన విత్తనాలు సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దాడుల్లో విజిలెన్స్ అధికారి సీహెచ్.ఆదినారాయణ, ఇన్‌స్పెక్టర్లు కె.చంద్రశేఖర్, పి.శివాజీ, మండల వ్యవసాయాధికారి కె.సుధీర్‌బాబు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
అనుమతి లేని వరి విత్తనాలు గుర్తింపు రూ.5,85,300 విలువైన విత్తనాలు సీజ్ చేసిన అధికారులు