సత్తెనపల్లి: చేనేత ఇక్కత్ డిజైన్ కళ భవిష్యత్తు తరాలకు అందించాలని చేస్తున్న కృషికి పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కర్నాటి మురళికి జాతీయ ఉత్తమ నేత వృత్తిదారుడి అవార్డు వరించింది. దేశవ్యాప్తంగా 19 మందికి అవార్డులు ప్రకటించగా.. రాష్ట్రం నుంచి మురళికి అరుదైన అవకాశం లభించింది. దేశ రాజధాని వేదికగా ఢిల్లీలోని భారత్ మండపంలో గురువారం జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, మంత్రి పబిత్రా మార్గరిటా చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నేత వృత్తిదారుడి అవార్డును మురళి అందుకున్నారు. తండ్రి సాంబయ్య నుంచి చేనేత కళా నైపుణ్యాన్ని నేర్చుకున్న మురళి నాలుగున్నర దశాబ్దాలుగా చేనేత డిజైన్లపై పనిచేస్తున్నాడు. కేవలం ఆరో తరగతి వరకే చదువుకున్న ఆయన వారసత్వ చేనేత ప్రతిభ ఆధారంగా అమరావతిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ)లో ఇక్కత్ డిజైన్లపై శిక్షణ ఇస్తున్నాడు.
కోర్టు తీర్పుపై ఉపాధ్యాయ నేతల హర్షం
తాడేపల్లిరూరల్ : స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో 2019లో ఉపాధ్యాయులపై అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులపై నమోదైన కేసు తీర్పు గురువారం ఉపాధ్యాయులకు అనుకూలంగా రావడంతో హర్షం వ్యక్తం చేశారు. జనవరి 31, 2019 సంవత్సరంలో ఏపీసీపీ ఎస్‌ఇఏ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ పిలుపు ఇచ్చారు. అప్పట్లో తాడేపల్లి పోలీసులు 17 మంది ఉపాధ్యాయులపై కేసు నమోదు చేశారు. ఆ కేసులో కర్నూలుకు చెందిన ఏడుగురు, విజయనగరానికి చెందిన ఆరుగురు, అనంతపురానికి చెందిన ముగ్గురుపై కేసు నమోదైంది.
మంగళగిరి న్యాయస్థానం ఉపాధ్యాయులపై అప్పటి ప్రభుత్వం మోపిన కేసు కొట్టివేయడంతోఅధ్యక్ష కార్యదర్శులు బాజీ పఠాన్, కరీమ్ రాజేశ్వరరావు కోర్టు తీర్పుపట్ల హర్షం వ్యక్తం చేస్తూ న్యాయం గెలిచిందని అన్నారు. తమ న్యాయమైన కోర్కెల కోసం శాంతియుతంగా ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపడితే తాడేపల్లి పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారు. అప్పటి నుండి 17 మంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారన్నారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో సీబీ వెంకట రమణారెడ్డి (కర్నూలు), ప్రేమనాధ రెడ్డి (అనంతపురం), జె. రమేష్ (కర్నూలు) కులాయప్ప (అనంతపురం), అజయ్ (విజయనగరం) తవిడి నాయుడు (విజయనగరం), సత్యనారాయణ (గుంటూరు) ఉన్నారు.

‘వారసత్వ చేనేత’ జాతీయ అవార్డు అందుకున్న మురళి