
మాదక ద్రవ్యాల వినియోగం మానవ మనుగడకు ప్రమాదకరం
నరసరావుపేట రూరల్: మాదక ద్రవ్యాల వినియోగం మానవ మనుగడకు ప్రమాదకరమని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, శక్తి యాప్ వినియోగం, రోడ్డు భద్రత నియమాలుపై కళాశాలల ప్రతినిధులతో గురువారం అవగాహన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ యువతలో డ్రగ్స్ వినియోగం వలన కలిగే హానికర ప్రభావాలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. దీనిపై నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని కోరారు. కళాశాలలో విద్యార్థుల ప్రవర్తన, నడవడిక, చదువు తదితర అంశాలపై అధ్యాపకులపాటు తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుత సమాజంలో యువత చాలా తేలికగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతుందని, వీరిలో 15 నుంచి 30 సంవత్సరాల వయస్సు వారు ఎక్కువుగా ఉంటున్నట్టు తెలిపారు. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు అలవాటు పడి మానసిక నియంత్రణ కోల్పోయి, వ్యసనాలను తీర్చుకునేందుకు నేర ప్రవృత్తి వైపు మళ్లి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. మాదక ద్రవ్యాలను నివరించేందుకు జిల్లా వ్యాప్తంగా 370 ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేశామని, తమ పరిసరాల్లో గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగించినా, విక్రయించినా పోలీసులకు లేదా 1972 టోల్‌ఫ్రీ నెంబర్‌కు తెలియజేయాలని కోరారు. మహిళ భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం శక్తి యాప్‌ను తీసుకువచ్చినట్టు తెలిపారు. అత్యవసర సమయాల్లో మహిళలు శక్తి ఎస్‌వోఎస్ యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఆగస్ట్ నెల మొత్తం ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం కళాశాల ప్రతినిధులతో కలిసి డ్రగ్స్ వద్దు బ్రో ప్లేకార్డులను ప్రదర్శించారు. కార్యక్రమంలో అడ్మిన్ ఎస్పీ జేవి సంతోష్, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ ఎం.వెంకటరమణ, జిల్లా డ్రగ్ కంట్రోల్ ఆఫీసర డి.సునీత, డీఏఈవో ఎం.నీలావతి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు