
జిల్లాలో సమృద్ధిగా ఎరువుల నిల్వలు
సత్తెనపల్లి: జిల్లాలో సమృద్ధిగా ఎరువుల నిల్వలు ఉన్నాయని రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.జగ్గారావు చెప్పారు. సత్తెనపల్లి సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు డీఏఓ మాట్లాడుతూ జిల్లాలో ఆగస్టు నాటికి యూరియా 18,596 టన్నులు అవసరం కాగా 33 వేల టన్నులు వచ్చిందన్నారు. దీనిలో ఇప్పటివరకు 11 వేల టన్నులు విక్రయించగా ఇంకా 22 వేల టన్నుల నిల్వలు ఉన్నాయన్నారు. డీఏపీ ఆగస్టు నాటికి 10,700 టన్నులు అవసరం కాగా 13 వేల టన్నుల డీఏపీ జిల్లాకు వచ్చిందన్నారు. దీనిలో ఇప్పటి వరకు 4 వేల టన్నులు విక్రయంచగా ఇంకా 9 వేల టన్నుల డీఏపీ నిల్వలు ఉన్నాయన్నారు. పట్టణంలోని ఎరువుల దుకాణాలు, సొసైటీలలో ఎరువుల నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రం నందు పొగాకు కొనుగోలు వివరాలు తెలుసుకున్నారు.
డిజిటల్ క్రాప్ సర్వే వేగవంతం చేయాలి
ఈ–పంట డిజిటల్ క్రాప్ సర్వే వేగవంతం చేయాలని, ఖరీఫ్ సీజన్‌లో ప్రస్తుతం సాగు చేసినటువంటి పంటలను ఈ–పంట నమోదు ద్వారా క్రాప్ నమోదు చేపట్టాలని డీఏఓ ఎం.జగ్గారావు అన్నారు. దీనికి సంబంధించి ఈ–క్రాప్ నిబంధనలో మార్పు జరిగిందన్నారు. గతంలో రూపొందించిన యూనిఫైడ్ డిజిటల్ ఫ్లాట్ ఫారం (యుడీపీ) యాప్‌ను రద్దుచేసి జాతీయ సమాచార కేంద్రం (ఎన్‌ఐసీ) ద్వారా ఈ– పంట డిజిటల్ క్రాప్ సర్వే పేరుతో కొత్త యాప్‌ను రూపొందించడం జరిగిందన్నారు. ఈ ఏడాది వరితో పాటు ఉద్యాన పంటలనూ నమోదు చేయాలన్నారు. ముందుగా వీఏఏలు, వీహెచ్‌ఏలు, ఎంపీఈఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు సత్తెనపల్లి ఏడీఏ బోయపాటి రవిబాబు, ఏఓ బి.సుబ్బారెడ్డి, తదితరులు ఉన్నారు.
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు