
ప్రకృతి వ్యవసాయంలో భాగస్వామ్యం కావాలి
నరసరావుపేట రూరల్: ప్రకృతి వ్యవసాయ విధానంలో రైతులందరూ పంటలు సాగు చేసే విధంగా వ్యవసాయ, ఉద్యాన అధికారులు భాగస్వామ్యంతో పనిచేయాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం జిల్లా కార్యాలయంలో గ్రామ సహాయ సంచాలకుల మూడవ రోజు శిక్షణా కార్యక్రమం గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు మాట్లాడుతూ వ్యవసాయ శాఖలో భాగమైన ప్రకృతి వ్యవసాయ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక స్థానం కల్పించిందన్నారు. రైతుల ఖర్చు తగ్గి ఆదాయం పొందే విధంగా రసాయనాలు వీడి కషాయాలు వాడే పద్ధతుల్లో పంటలను సాగు చేయాలని తెలిపారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ విధానాల్లో పంటలు సాగుచేసే విధంగా రైతులకు వ్యవసాయ సిబ్బంది, గ్రామ సహాయ సంచకులు కృషిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ శాంతి తదితరులు పాల్గొన్నారు.
వినుకొండలో సీపీఐ
మహాసభలు ప్రారంభం
వినుకొండ: వినుకొండలో సీపీఐ పల్నాడు జిల్లా మహాసభలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. ఈ సభలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావులతోపాటు పలువురు జిల్లా నాయకులు హాజరయ్యారు. నర్సరావుపేట నుంచి సీపీఐ నాయకులు, కార్యకర్తలు పౌరాణిక వేషధారణలో సభాస్థలికి వచ్చారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటరు నుంచి నిర్వహించిన ర్యాలీలో వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.