
రాష్ట్రంలో బలహీనవర్గాలకు రక్షణ లేదు
వైఎస్సార్ సీపీ వడ్డెర విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు దేవళ్ల రేవతి
దాచేపల్లి: కూటమి ప్రభుత్వం అండ చూసుకొని ఆ పార్టీ నేతలు చేస్తున్న భౌతిక దాడులు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నాయని, రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ పాలన అమలు చేస్తూ బలహీనవర్గాలను అణచివేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వడ్డెర విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ దేవళ్ల రేవతి అన్నారు. బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆర్.రమేష్ యాదవ్‌పై జరిగిన దాడిని గురువారం ఆమె తీవ్రంగా ఖండించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి నేతలు నిలబెట్టిన అభ్యర్థి ఓడిపోతారని తెలిసే వైఎస్సార్ సీపీ అభ్యర్థి విజయాన్ని అడ్డుకునేందుకు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై దాడికి తెగబడ్డారని చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను జరగనివ్వకుండా కూటమినేతలు దాడులకు తెగబడుతూ ప్రతిపక్ష పార్టీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై జరిగిన దాడిని తమ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని, దీనిపై తమ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉద్యమం చేపడతామని వెల్లడించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పై దాడులు చేస్తూ నీచమైన పాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో దాడులకు పాల్పడిన వారిపై జగన్ 2.0 లో చర్యలు తప్పక ఉంటాయని, కూటమి నేతల దాడులకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు భయపడకుండా ధైర్యంగా ఎదురుకోవాలని, వచ్చేది మన ప్రభుత్వమేనన్నారు.