
నూరుశాతం అక్షరాస్యతే లక్ష్యం
నరసరావుపేట రూరల్: రాష్ట్రంలో నూరుశాతం అక్షరాస్యత సాధించే లక్ష్యంతో ఉల్లాస్–అక్షర ఆంధ్ర వయోజన అక్షరాస్యత కార్యక్రమాన్ని చేపట్టినట్టు వయోజన విద్యాశాఖ ఉప సంచాలకులు కె.ఆంజనేయులు తెలిపారు. ఉల్లాస్ వయోజన అక్షరాస్యత కార్యక్రమం రెండవ దశ ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమంపై మండల స్ధాయి కమిటి సభ్యులకు ఒక్క రోజు శిక్షణా కార్యక్రమం మున్సిపల్ గెస్ట్ హౌస్‌లో గురువారం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆంజనేయులు ప్రారంభించి మాట్లాడారు. అక్షరాస్యతలో మన రాష్ట్రం దేశంలోని ఇతర చిన్న రాష్ట్రాల కన్నా వెనుకబడి ఉందన్నారు. 2029 నాటికి నూరు శాతం అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో ఇతర ప్రభుత్వ శాఖల సహకారంతో పనిచేస్తున్నట్టు తెలిపారు. డీఆర్‌డీఏ, మెప్మాలలోని స్వయం సహాయక బృందాల మహిళలు, ఉపాధి హామీ కూలీలలో చదువురాని వారిని గుర్తించి వారికి చదువు చెప్పేందుకు పదమందికి ఒక వలంటీర్‌ను నియమిస్తున్నట్టు తెలిపారు. వలంటీర్లకు మండల స్థాయి కమిటీలు వారి మండలాల్లో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం టీచర్లు వారికి కేటాయించిన అభ్యాసకులకు క్రియాత్మక, ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతను అందించవలసి ఉంటుందని వివరించారు. బాపట్ల జిల్లా నోడల్ ఆఫీసర్ జి.మల్లికార్జన్, డ్వామా పీడీ సిద్ద లింగమూర్తి, రీసోర్స్ పర్సన్స్ కె.మనోరంజన్‌బాబు, రవి గోవర్ధన్, ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఏపీఎంలు, ఏపీఓలు, మెప్మా సీఎంఎంలు పాల్గొన్నారు.