
ప్రజల సహకారంతోనే గ్రామాల్లో స్వచ్ఛత
ప్రత్తిపాడు: ప్రజల సహకారంతోనే గ్రామాల్లో స్వచ్ఛత సాధ్యపడుతుందని జెడ్పీ సీఈవో వి. జ్యోతిబసు అన్నారు. ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెంలోని సుప్రీం ఎల్‌టీసీలో బుధవారం హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణకు గుంటూరు జిల్లాలోని 17 మండలాల ఎంపీడీవోలు, డెప్యూటీ ఎంపీడీవోలు హాజరయ్యారు. వారు ఆరు బృందాలుగా క్లాప్ మిత్రలతో కలిసి ఇంటింటికీ వెళ్లి తడి చెత్త, పొడి చెత్త సేకరణ విధానాలపై ఆరా తీశారు. మహిళలతో మాట్లాడారు. వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛ లక్ష్యాలను అనంతరం రచ్చబండ సెంటరులో ప్రజలకు వివరించారు. స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హ్యాండ్ వాష్ చేయించారు. తదనంతరం గ్రామంలోని సుప్రీం ఎల్‌టీసీని సందర్శించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో మాట్లాడుతూ గ్రామాల స్వచ్ఛతపై యంత్రాంగం పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. జిల్లా పంచాయతీ అధికారి బి.వి.నాగసాయి కుమార్ మాట్లాడుతూ తుమ్మలపాలెం పంచాయతీలో జరుగుతున్న అన్ని రకాల స్వచ్ఛతా కార్యక్రమాలు జిల్లాలోని అన్ని మండలాల్లో జరిగేలా ఎంపీడీవోలు, డెప్యూటీ ఎంపీడీవోలు చూడాలన్నారు. గుంటూరు డీఎల్‌పీవో శ్రీనివాసరావు గ్రామంలో విజయవంతంగా స్వచ్ఛతను అమలు చేస్తున్నారన్నారు. గ్రామ సర్పంచ్ చల్లా నాగమల్లేశ్వరి, కార్యదర్శి షేక్ ఖాజా, క్లాప్ మిత్రులను సత్కరించారు. ఎంపీడీవోలు, డెప్యూటీ ఎంపీడీవోలు, డీపీఆర్‌సి ప్రతినిధులు నిరంజన్, కరీముద్దిన్, అనురాధ, ఐటీసీ ఫినిష్ సొసైటీ కో–ఆర్డినేటర్ యశ్వంత్ శ్రీనివాసరావు, ఉమామహేశ్వరి పాల్గొన్నారు.
జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు