
పొగాకు రైతులను బలి చేయొద్దు
కొరిటెపాడు(గుంటూరు): పొగాకు రైతులను బలి చేయొద్దని, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మొత్తం కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం, ఏపీ కౌలు రైతు సంఘాల రాష్ట్ర కమిటీలు డిమాండ్ చేశాయి. సంఘాల ఆధ్వర్యంలో చుట్టుగుంట సెంటర్‌లోని వ్యవసాయ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీతో పొగాకు కొనుగోలు ఆపేస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన విరమించుకోవాలని పేర్కొన్నారు. 20 శాతం మాత్రమే కొన్నారని తెలిపారు. మిగతాదీ కొనకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ధర కూడా తగినంత ఇవ్వడం లేదని చెప్పారు. నాణ్యత లేదని పొగాకు వెనక్కి పంపుతున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ కంపెనీలతో కుమ్మకై ్క బయ్యర్లు ధర లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీ కౌలురైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు మాట్లాడుతూ కొనుగోలు చేసిన పొగాకుకు సంబంధిత రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా జమ చేయలేదన్నారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు అందుబాటులో లేకపోవడంతో మార్కెటింగ్ శాఖ రాష్ట్ర కమిషనర్ విజయ సునీతకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నల్లమడ సంఘం నాయకులు కొల్లా రాజమోహన్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంచుమాటి అజయ్‌కుమార్, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై. రాధాకృష్ణమూర్తి, నంద్యాల జిల్లా రైతు నాయకులు వెంకటేశ్వర గౌడ్, రైతు సంఘాల నాయకులు కొల్లి రంగారెడ్డి, పాడిబండ్ల కోటేశ్వరరావు, బండి శంకరయ్య, బిక్కి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఏపీ రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు