
క్రైస్తవులపై అక్రమ కేసుల ఎత్తివేతకు డిమాండ్
నగరంలో క్రైస్తవ సంఘాల భారీ శాంతి ర్యాలీ
నెహ్రూనగర్: చత్తీస్‌గడ్‌లో ఇద్దరు నన్‌లను అక్రమంగా అరెస్ట్ చేశారని, వారిపై అక్రమ కేసులను ఎత్తివేయాలని గుంటూరు మేత్రాసన పీఠాధిపతి డాక్టర్ చిన్నాబత్తిన భాగ్యమ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు క్రైస్తవ, దళిత, బహుజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ఏసీ కాలేజీ ఎదురుగా ఉన్న పునీత ఆగ్నేసమ్మ దేవాలయం నుంచి కలెక్టరేట్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతమార్పిడుల పేరుతో సిస్టర్లను అన్యాయంగా అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇలాంటి దాడులపై ఐక్యంగా ఉంటూ పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బలవంతపు మత మార్పిడి ఎవరూ చేయరని, సమాజంలో అట్టడుగువర్గాల అభివృద్ధికి క్రైస్తవ మతం కృషి చేస్తుందన్నారు. వీసీకే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌జె విద్యాసాగర్ మాట్లాడుతూ దేశంలో దశాబ్దాలుగా క్రైస్తవులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. వారు కూడా భారతీయులేనని గ్రహించలేని స్థితిలో మతోన్మాదులు ఉన్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆనంతరం డీర్‌ఆర్‌ఓ ఖాజావలికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు గాబ్రియేల్, సహదేవ్, నెహెమ్యా, మార్కు, బాబురావు, సతీష్‌కుమార్, కిరణ్, రాజు, రేపూడి రాయప్ప, అబ్రహం, విజయ్‌పాల్, వివిధ సంఘాల నాయకులు నల్లపు నీలాంబరం, మద్దు ప్రేమజ్యోతిబాబు, డాక్టర్ కర్రా హనోక్ బెంజిమెన్, రత్నశ్రీ, జీఆర్ భగత్ సింగ్, జూపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.