
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై దాడిచేసిన గూండాలను అరెస్ట్ చ
వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.సింగరయ్య యాదవ్
దాచేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆర్.రమేష్ యాదవ్‌పై దాడి చేసి గాయపరిచిన టీడీపీ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగాల సింగరయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై జరిగిన దాడిని బుధవారం ఆయన తీవ్రంగా ఖండించారు. కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండపల్లి గ్రామంలో కారులో ప్రయాణిస్తుంటే, కారును అడ్డగించి, కారు అద్దాలు పగలగొట్టి కారులో ఉన్న రమేష్ యాదవ్‌పై తెలుగుదేశం పార్టీ గూండాలు, కార్యకర్తలు తీవ్రంగా దాడి చేసి గాయపరిచారన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అమలు చేస్తూ వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు చేయటం, అక్రమ కేసులు పెట్టడం లక్ష్యంగా పరిపాలన కొనసాగుతుందని మండిపడ్డారు. ఈ దాడి రమేష్ యాదవ్ మీద జరిగిన దాడి మాత్రమే కాదని, రాష్ట్రంలోని మొత్తం బడుగు, బలహీన వర్గాల మీద జరిగిన దాడి అని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, కేవలం నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఈ దాడికి వ్యతిరేకంగా ఉద్యమించాలని, దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.