
టీచర్లకు ఇచ్చిన ఒక్క హామీనీ నెరవేర్చని ప్రభుత్వం
ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు
చిలకలూరిపేట: ఎన్నికలకు ముందు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు, రాష్ట్ర డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావులు పేర్కొన్నారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఎస్టీయూ సంఘ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటామని, ఎటువంటి బకాయిలు లేకుండా వెంటనే చెల్లిస్తామని ఇచ్చిన హామీలు ఏ మాత్రం నెరవేరలేదన్నారు. పెండింగ్ బకాయిలు, నాలుగు డీఏలు వెంటనే ప్రకటించాలన్నారు. వేతన సవరణ సంఘం చైర్మన్‌ను నియమించాలని, ఈ లోపు 30 శాతం మధ్యంతర భృతిని చెల్లించాలని డిమాండ్ చేశారు. జూన్ నెలలో బదిలీలు జరిగిన 60వేల మందికి పైగా ఉపాధ్యాయులకు నేటికీ జీతాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎస్టీయూ నాయకులు వి.అక్కయ్య, కె.కోటేశ్వరరావు, వి.జయప్రకాశ్, షేక్ మగ్బూల్‌బాష, దుర్గా ప్రసాద్, జి.కోటేశ్వరరావు, సతీష్‌కుమార్, బి.రవి, మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు.