
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
యడ్లపాడు: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు కాగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్‌ఐ టి.శివరామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేట వైపునకు వెళుతున్న కారు టైర్ పంక్చర్ కావడంతో యడ్లపాడు జాతీయ రహదారిపై పిల్లికొండ వద్ద కారు నిలుపుదల చేసుకున్నారు. అయితే అదేమార్గంలో మండలంలోని జగ్గాపురం గ్రామానికి చెందిన అన్నలదాసు తేజ్‌పాల్, దావల యువరాజు అనే ఇద్దరు యువకులు బైక్‌పై చిలకలూరిపేట వైపునకు ప్రయాణిస్తున్నారు. కారుడ్రైవర్ అకస్మాత్తుగా డోర్ తెరవడంతో బైక్ వేగంగా వచ్చి డోర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు రోడ్డుపై పడి తీవ్రగాయాలయ్యాయి. గాయాలైన వారిని చిలకలూరిపేట, గుంటూరు పట్టణాల్లోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. అయితే వారిలో ఒకరికి మెదడులో బ్లడ్ క్లాటై, పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్
తెనాలి రూరల్: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో సెప్టెంబర్ 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ మేరకు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి.శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని రకాల సివిల్, భరణం, బ్యాంకు దావాలు, మోటారు వాహనాల ప్రమాదాల కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను ఈ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.