
టీపీఓపై అవినీతి ఆరోపణలపై క్షేత్రస్థాయిలో విచారణ
టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ మధుకుమార్
సత్తెనపల్లి: సత్తెనపల్లి టౌన్ ప్లానింగ్ అధికారి(టీపీఓ) రాధాకృష్ణపై క్షేత్రస్థాయిలో విచారించి చర్యలకు సిఫార్సు చేస్తానని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ గుంటూరు రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పి.మధుకుమార్ అన్నారు. సత్తెనపల్లి టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండటమే కాక కార్యాలయం ముగిసిన తర్వాత ప్లానింగ్ సెక్రటరీల ద్వారా అవినీతికి పాల్పడుతున్నారని, ఇటీవల కౌన్సిల్ సాధారణ సమావేశంలో పెద్దఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విచారణ నిమిత్తం మధు కుమార్ సత్తెనపల్లి పురపాలక సంఘాన్ని మంగళవారం సందర్శించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ చల్లంచర్ల లక్ష్మీతులసి, 4వ వార్డ్ కౌన్సిలర్ కటకం రామకృష్ణలతో పాటు మరికొందరు టీపీఓ రాధాకృష్ణపై పలు ఆరోపణలు చేయడమే కాకుండా లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు అందించారు. ఈ క్రమంలో క్షుణ్ణంగా పరిశీలన జరిపారు. అనంతరం టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా మధుకుమార్ మాట్లాడుతూ మరో రెండు రోజుల్లో ప్రత్యేక టీంను ఏర్పాటు చేస్తానని, ఆ టీం క్షేత్రస్థాయిలో అనధికార లేఅవుట్లు, ఆక్రమణలు తొలగింపులో పక్షపాత ధోరణి, అంతేకాక ఎవరెవరు దగ్గర ఎలాంటి వసూళ్లకు పాల్పడ్డారనే అంశాలపై విచారణ జరిపి నివేదిక ఇస్తుందని, దాని ప్రకారం చర్యలకు డీటీసీకి సిఫార్సు చేస్తానన్నారు. ఆయనతో పాటు ఆర్డీ కార్యాలయ టీపీఓ పూర్ణచంద్ర రావు ఉన్నారు.