
ఇకపై ఉపాధి కూలీలకు ముఖ ఆధారిత హాజరు
జిల్లా ‘ఉపాధి’ పీడీ సిద్దా లింగమూర్తి
శావల్యాపురం: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు ఇకపై ముఖ ఆధారిత హాజరు నమోదు చేస్తారని జిల్లా ఉపాధి హామీ పథకం పీడీ సిద్దా లింగమూర్తి అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నూజెండ్ల, బొల్లాపల్లి మండలాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లకు నూతన మస్టర్ విధానంపై శిక్షణా తరగతులు నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ ఉపాధి పథకంలో అవినీతి, అక్రమాలు నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఒక్కో ఉపాధి కూలీ ముఖ ఆధారిత చిత్రాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. ఎఫ్‌ఏలు పని ప్రదేశంలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌తో హాజరు నమోదు చేయాలన్నారు. అలాగే ఈకేవైసీ నమోదు చేయించుకోని వారికి వేతనం మంజూరు కాదన్నారు. ఉపాధి శ్రామికులు చేసిన పనులకు సంబంధించిన పని కొలతలు, సమగ్ర వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంపై గ్రామాల్లో క్షేత్రసహాయకులు ప్రచారం చేయాలన్నారు. నకలీ మస్టర్స్‌కు తావు లేకుండా నూతన విధానం దోహదపడుతుందన్నారు. శిక్షణా తరగతులు పూర్తికాగానే నూతన విధానం అమల్లోకి వస్తుందన్నారు. శిక్షణా తరగతుల్లో జిల్లా ప్లాంటేషన్ ఉద్యాన అధికారి శిరీషా, ఏపీడీ బూసిరెడ్డి, ఏపీఓలు ఆంజనేయరాజు, లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.