కొండవీడుకోటలో ఉద్రిక్తత
● సందర్శకులు, స్ట్రైకర్ల మధ్య వాగ్వాదం ● గ్రామస్తులు సందర్శకుల కారు అడ్డగించి దాడి ● విచారణ ప్రారంభించిన పోలీసులు
యడ్లపాడు: పర్యాటక కొండవీడుకోట ప్రాంతంలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుంటూరు మిర్చి యార్డు సమీపంలోని సాయినగర్‌కు చెందిన లక్ష్మీప్రియ, భర్త ముని కోటేశ్వరరావు, కుమార్తె, మేనల్లుడు సోమవారం సాయంత్రం సందర్శనకు రాగా, కొండవద్ద ఉన్న స్ట్రైకర్ల (ఔట్‌సోర్సింగ్)తో వాగ్వాదం జరిగింది. స్ట్రైకర్ల సమాచారంతో గ్రామస్తులు సందర్శకుల కారును ఆపి దాడిచేసి, కారు అద్దాన్ని ధ్వంసం చేశారంటూ ఘటన స్థలం నుంచి బాధితులు పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం పోలీసులు ఈ సంఘటనపై విచారణ ప్రారంభించారు. చిలకలూరిపేట రూరల్ సీఐ బి.సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్‌ఐ టి శివరామకృష్ణతో కలిసి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. కొత్తపాలెం ఘాట్‌రోడ్డుకు చేరుకొని అటవీశాఖ ఆధీనంలో విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందితోపాటు గ్రామస్తులను కలిశారు. ఘటన సమయంలో విధుల్లో ఉన్న స్ట్రైకర్లు, అటవీశాఖ అధికారులు, గ్రామ పెద్దలతో మాట్లాడి ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితుల్ని తెలుసుకున్నారు.
సమగ్ర విచారణ అనంతరం కేసులు నమోదు
సోమవారం రాత్రి జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ తర్వాత కేసు నమోదు చేయనున్నట్లు సీఐ సుబ్బానాయుడు చెప్పారు. కొండవీడుకోటకు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఘాట్‌రోడ్డుపై విధుల్లో ఉన్న స్ట్రైకర్లు యూనిఫారమ్, గుర్తింపు కార్డులు లేకుండా విధులు నిర్వహించడమే ప్రధానంగా సందర్శకుల్లో అపోహలు కలగడానికి దారితీసినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. స్ట్రైకర్లు సహనం పాటించకపోవడం, గ్రామస్తులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతోనే స్థానికులు కారును అడ్డగించి దాడికి పాల్పడినట్లు తెలిసిందని వివరించారు. సోమవారం రాత్రి యడ్లపాడు పోలీసులకు ఘటన సమాచారం అందగానే కానిస్టేబుల్ కొత్తపాలెం గ్రామానికి చేరుకునేలోపు వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పారు. సందర్శకుల కారు నంబర్ ఆధారంగా వారి ఫోన్ నెంబర్లను సేకరించి, వ్యక్తులతో మాట్లాడి వాస్తవాలను తెలుసుకుంటామన్నారు. మంగళవారం సాయంత్రం వరకు బాధితుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదన్నారు. సమగ్ర సమాచారం వెలుగులోకి వచ్చిన అనంతరం ఘటనకు కారణమైన వారిపై కేసులు నమోదు చేస్తామని సీఐ బి సుబ్బానాయుడు స్పష్టం చేశారు.
ఇకపై చర్యలు తప్పవు
కొండవీడు ప్రాంతానికి వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టిని సారిస్తామని సీఐ చెప్పారు. స్టైకర్లు స్థానికులమనే భావన వీడి విధి నిర్వహణను బాధ్యతగా నిర్వహించాలని, సందర్శకుల పట్ల బాధ్యతగా ప్రవర్తించకుంటే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. పోలీసుల మొబైల్ నంబర్లను కొండవీడుకోట సందర్శకులకు కనిపించేలా పలుచోట్ల రాయించాలని ఎస్‌ఐను ఆదేశించామన్నారు. స్ట్రైకర్లు వారంరోజుల్లోగా యూనిఫాం, ఐడీకార్డులను సమకూర్చుకోవాలని, అవసరమైతే అటవీశాఖ అధికారులతో చర్చించనున్నట్లు చెప్పారు. ఇలాంటి ఘటన తిరిగి పునరావృతం కాకుండా పైచర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రశ్నించినందుకే దాడి చేశారు : లక్ష్మీప్రియ
కొండవీడు సందర్శనకు వెళ్లి స్ట్రైకర్లు, కొత్తపాలెం గ్రామస్తుల దాడిలో గాయపడిన బాధితురాలు దాసరి లక్ష్మీప్రియ మంగళవారం ఫోన్‌లో మీడియాతో మాట్లాడారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్‌లో పనిచేశా, ప్రస్తుతం గుంటూరు సాయినగర్‌లో ఉంటూ బాలికలకు ఆత్మసంరక్షణపై అవగాహన తరగతులు బోధిస్తున్నట్లు తెలిపారు. కొండపై ఉన్న క్రీడాపార్కులో ఫొటోలు తీసుకునే ప్రయత్నం చేశాం, కొందరు యువకులు వచ్చి అడ్డుకున్నారు, మీరెవరంటూ ప్రశ్నించాం...వారిలో ఒకరు రూ.32 లక్షలు ప్రభుత్వానికి చెల్లించి లీజుకు తీసుకున్నామన్నాడు. ఐడీ, యూనిఫాంగాని ఎందుకు లేవని ప్రశ్నించినందుకు రెచ్చిపోయారు. ఆ తర్వాత కొండ కింద ఘాట్‌రోడ్డు చెక్‌పోస్టు వద్ద ఈ విషయంపై ఫిర్యాదు ఇవ్వాలని వస్తే అటవీశాఖ, పోలీసు అధికారులు లేరని చెప్పారు. అంతా యువకులే ఉన్నారు, మా కారును వెంటాడుతూ బైకుల పైన ఉన్న యువకులు వచ్చారు. అక్కడ కూడా వాగ్వాదం జరిగింది. వారు మా పాపపై చేయి వేయడంతో దూషించిన మాట వాస్తవమే. అయితే ఊరు దాటి వెళ్లలేవంటూ కారులో వెళ్లే మమ్మల్ని గ్రామంలో చెత్తవాహనాలు, బైక్‌లు అడ్డుగా పెట్టి దాడి చేయించారని తెలిపారు. కారు అద్దాలు ధ్వంసం చేసి కిందకు లాక్కెళ్లి మా కుటుంబ సభ్యులందరి చేతుల్ని వెనక్కి విరిచి క్షమాపణలు చెప్పించారు. పవన్ అభిమానులమని చెబితే, మాకు అంతకంటే ఎక్కువ ఉంది ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకోమంటూ దాడిచేశారని వాపోయింది. ఆ సమయంలో ఇద్దరు పోలీసులు వచ్చారని, వారు చూసీచూడనట్లు వ్యవహరించారని తెలిపింది. యడ్లపాడు ఎస్‌ఐకి ఫోన్‌చేసినా రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మా తప్పు ఉంటే మమ్మల్ని పోలీసులకు అప్పగించాలి గానీ దాడి చేయడం ఏమిటని ప్రశ్నించింది. రాష్ట్రంలో వీరమహిళలకు అన్యా యం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోదా...అందుకే ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని మంగళవారం సచివాలయంలో ఫిర్యాదు చేసినట్లు లక్ష్మీప్రియ చెప్పారు.
కొండవీడుకోటలో ఉద్రిక్తత
కొండవీడుకోటలో ఉద్రిక్తత


