పిన్నెల్లి సోదరులపై హత్య కేసు ఉపసంహరించాలి
నరసరావుపేట: మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో హత్యకు గురైన ఇద్దరు టీడీపీ కార్యకర్తల కేసులో పిన్నెల్లి సోదరులపై బనాయించిన అక్రమ కేసును బేషరతుగా ఉపసంహరించుకోవాలని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దీనిపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. నరసరావుపేటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో జెవిశెట్టి వెంకటేశ్వర్లు, అతని సోదరుడు కోటేశ్వరరావులను టీడీపీలోని ప్రత్యర్థులు జెవిశెట్టి శ్రీనివాసరావు, తోట వెంకటరామయ్యలు హత్య చేశారని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు స్వయంగా ప్రకటించారన్నారు. ఆ గ్రామంలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగానే ఈ హత్యలు జరిగాయని ఎస్పీ ఒక వీడియోను మీడియాకు రిలీజ్ చేశారన్నారు. తోట చంద్రయ్య హత్యతో ఈ హత్యకు ఎటువంటి సంబంధంలేదని కూడా ఎస్పీ చెప్పడం జరిగిందన్నారు. ఈ నేరానికి సంబంధించిన ఐదుగురు నిందితులను కూడా అరెస్ట్ కూడా చేశారన్నారు. ఆ విధంగా జరిగిన హత్యలపై ఎస్పీ చెప్పిన తర్వాత కూడా నాలుగుసార్లు శాసనసభ్యుడిగా, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులుగా, ప్రభుత్వ విప్‌గా పనిచేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపైన, ఒక ఏడాది కాలంగా ఊళ్లోలేని, ఎక్కడున్నాడో కూడా తెలియని అతని తమ్ముడు వెంకటరామిరెడ్డిపై కేసు బనాయించడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. చనిపోయిన వారు, చంపిన వారు ఇద్దరు టీడీపీ వారేనని అందరూ చెప్పుకుంటున్నారన్నారు. ఇది కేవలం కక్ష సాధింపు ధోరణితోనే ఇటువంటి చర్యలు చేపడుతున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. గురజాల సబ్ డివిజన్‌లో రెండు నెలల నుంచి డీఎస్పీ లేడని, ఎందుకు పోస్టింగ్ వేయలేకపోతున్నారని ప్రశ్నించారు. గ్రామంలో పల్లెనిద్ర చేసిన ఎస్పీ, ఇన్‌చార్జి డీఎస్పీ అక్కడ సమస్యలు విని మీకు ఏమైనా సమస్యలు ఉంటే జెవిశెట్టి వెంకటేశ్వర్లుకు చెప్పమని కూడా చెప్పారన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదని ఉద్దేశంతో ఎస్పీ, డీఎస్పీ, ఇంతమంది పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా వెళ్లి చెప్పినప్పటికీ ఈ హత్యలు జరిగాయంటే దీనికి పోలీసుల బాధ్యతలేదా అని ప్రశ్నించారు. ఒక గ్రామంలో రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంటే టీడీపీ నాయకుడు ఏం చేస్తున్నాడని ప్రశ్నించారని ప్రశ్నించారు. ఈ హత్యను అరెస్టు చేసి న ఆ ఐదుగురు నిందితులే చేశారని ప్రత్యక్ష సాక్షి మృతుల బావమరిది స్వయంగా చెప్పాడని అన్నా రు. దీనిపై హైకోర్టు కూడా వెళ్తామని తెలియజేస్తూ, తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి


