రక్తదానానికి ఉద్యోగులు సహకరించాలి
నరసరావుపేట: ప్రతి ప్రభుత్వ శాఖ నుంచి కనీసం 50 మంది రక్తదానం చేయాలని, దీనికి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ సహకరించాలని జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ కోరారు. రెడ్‌క్రాస్ జిల్లా ప్రెసిడెంట్, జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు మార్గదర్శకత్వంలో మంగళవారం కలెక్టరేట్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథులుగా హాజరైన జేసీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారికి చేసే సర్జరీలలో రక్తం అవసరం ఎంతైనా ఉంటుందన్నారు. ప్రస్తుతం వేసవిలో రక్తం కొరత ఏర్పడిందన్నారు. ప్రభుత్వం బాధ్యతగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థల ద్వారా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఏర్పాటు చేశామన్నారు. దానిలో భాగంగానే మొదటి కార్యక్రమం జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి మాట్లాడుతూ రెడ్‌క్రాస్ అభ్యర్థన మేరకు జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, మండలాల వారీగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని ఒక సర్క్యులర్ విడుదల చేశామని తెలిపారు. మొత్తం 43 మంది రక్తదానం చేయగా వారందరికీ డీఆర్‌ఓ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు మురళీకృష్ణ, కేఎంఎన్‌వీ శ్రీనివాసగుప్తా, బత్తుల మురళి, డాక్టర్ రహమతుల్లా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలియజేశారు. డిప్యూటీ కలెక్టర్ కేఆర్‌సీసీ కుమార్, అడ్మిన్ ఆఫీసర్ ఎం.లీలాసంజీవకుమారి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ప్రసూన, బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో
రక్తదాన శిబిరం


