
రోగికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం
నరసరావుపేట: కూటమి ప్రభుత్వంలో పేదలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షలా మారింది. కలెక్టరేట్ సమీపంలోని 200 పడకల ప్రభుత్వ వైద్యశాలలో సరైన వసతులు లేక రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాస్పిటల్‌లో కొన్ని రోజులు క్రితం గుర్తుతెలియని వ్యక్తిని చికిత్స కోసం చేర్చగా, ఆ వ్యక్తికి చికిత్స అందజేయకుండా ఒక మూలన పడేశారని పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి శిక్కినం చిన్న పేర్కొన్నారు. విషయం తెలుసుకొని తాను హాస్పిటల్‌కు వెళ్లానని చెప్పారు. ప్రభుత్వ వైద్యశాలలో 30 మంది నర్సులకుగాను కేవలం పదిమంది ఉండటం వలన రోగులకు సరైన వైద్యం అందించలేని పరిస్థితి నెలకొందన్నారు. సుమారు 150 మందికిపైగా ఇన్‌పేషెంట్లు ఉంటే వారందరికీ పది మందితో ఏవిధంగా సేవలు అందజేస్తామని వైద్యులు తనతో చెప్పారని పేర్కొన్నారు. ఈ విషయంపై సూపరింటెండెంట్‌ను కలిసేందుకు ప్రయత్నించగా ఆయన అంగీకరించలేదన్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని కోరారు. ప్రభుత్వ వైద్యశాలలో సరైన వసతులు కల్పించాలని, బాధితులను మెరుగైన వైద్యం అందించాలని చిన్న డిమాండ్ చేశారు.
రోగి మానసిక పరిస్థితి సరిగా లేదు
దీనిపై హాస్పిటల్ సూపరింటెండెంట్ సురేష్‌కుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఆ రోగి మానసిక పరిస్థితి సరిగా లేదన్నారు. వైద్యానికి సహకరించట్లేదని పేర్కొన్నారు. తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. తాను బుధవారం హాస్పిటల్‌లో సదరన్ క్యాంపులో ఉన్నానని, అనంతరం సూపరింటెండెంట్ కార్యాలయంలో ఉన్నానని చెప్పారు. తనను ఎవరూ కలవలేదని పేర్కొన్నారు.
ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన
పౌరహక్కుల సంఘ నాయకుడు
రోగులకు సరైన వైద్యం అందట్లేదని
ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి
ఆరోపణ