భారీగా చేరుకున్న అభిమానులకు అభివాదం చేస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
సాక్షి ప్రతినిధి,బాపట్ల: రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ సోమవారం ఒంగోలులో మృతిచెందగా స్వగ్రామం మేదరమెట్లలో ఆమె అంత్యక్రియలు మంగళవారం బంధువులు, పార్టీశ్రేణుల అశ్రునయనాల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారని తెలుసుకొని వేలాదిగా కార్యకర్తలు, అభిమానులే కాదు సామాన్య జనమూ తరలి వచ్చారు. ఎంతగా అంటే జనం తాకిడికి జగన్ కాన్వాయ్ ముందుకు కదలలేకపోయింది. ఆ తర్వాత జగన్ వైవీ ఇంటికి చేరుకొని అక్కడ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించి చిన్నాన్న వైవీ.సుబ్బారెడ్డి, చిన్నమ్మ స్వర్ణమ్మ, చిన్నాన్నలు వైవీ భద్రారెడ్డి, హనుమారెడ్డి, సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్‌రెడ్డిలతోపాటు వారి కుటుంబ సభ్యులందరినీ పరామర్శించారు. భుజంతట్టి ఓదార్చారు. అక్కడే ఉన్న తల్లి విజయమ్మ, మేనమామ రవీంద్రనాథరెడ్డి ఇతర బంధువులతో మాట్లాడారు. అర్ధగంట పాటు అక్కడే ఉన్న వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో గడిపారు. వైఎస్సార్ సీపీ నేతలను పేరుపేరునా పలకరించారు. వైవీ ఇంటి నుంచి జగన్ తిరుగు ప్రయాణంలోనూ ఆయన వాహనం ముందు చేరిన కార్యకర్తలు, అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. పిచ్చమ్మ భౌతికకాయానికి వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, మాజీ ఉపముఖ్యమంత్రి మంత్రి నారాయణస్వామి, మాజీ మంత్రులు కారుమూరు నాగేశ్వరరావు, ఆదిమూలపు సురేష్, అంబటి రాంబాబు, విడదల రజని, జోగి రమేష్, ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ముస్తాఫా, బుర్రా మధుసూదనయాదవ్, జంకె వెంకటరెడ్డి, టీజేఆర్ సుధాకర్‌బాబు, పార్టీ నాయకులు కరణం వెంకటేశ్, గాదె మధుసూదన్‌రెడ్డి, వరికూటి అశోక్‌బాబు, మేరిగ మురళి, చుండూరు రవి, పానెం చిన హనిమిరెడ్డి తదితరులు నివాళు లర్పించారు.
వైవీ సుబ్బారెడ్డి తల్లి అంత్యక్రియలకు మేదరమెట్లకు వచ్చిన జగన్ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ భౌతిక కాయానికి నివాళులు కుటుంబ సభ్యులకు పరామర్శ అర్ధగంటపాటు అక్కడే గడిపిన జననేత