ముగిసిన రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీలు | Sakshi
Sakshi News home page

ముగిసిన రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీలు

Published Sat, Nov 18 2023 2:00 AM

రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీల్లో విజేతగానిలిచిన గుంటూరు జిల్లా జట్టు  - Sakshi

పెదకాకాని: క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని డెప్యూటీ విద్యాశాఖాధికారి పి.వెంకటేశ్వరరావు చెప్పారు. పెదకాకాని మండలంలోని వెనిగండ్ల జిల్లా పరిషత్‌ పాఠశాలలో ప్రారంభమైన మూడు రోజుల 67వ ఏపీ ఎస్‌జీఎఫ్‌ఐ రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీలు శుక్రవారం ముగిశాయి. అండర్‌–17 బాలబాలికల విభాగాలలో జరిగిన ఈ పోటీలకు 13 జిల్లాల నుంచి 500 క్రీడాకారులు పాల్గొని ఉత్తమ ఆటతీరును ప్రదర్శించారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రాష్ట్రస్ధాయి పోటీల్లో గుంటూరు జిల్లా బాలుర జట్టు విజేతగా నిలవగా, రన్నర్‌గా శ్రీకాకుళం జట్టు నిలిచింది. విజయనగరం జట్టు తృతీయ స్థానాన్ని దక్కించుకుంది. అలాగే అండర్‌–17 బాలికల విభాగంలో ప్రకాశం జిల్లా జట్టు విన్నర్‌ కాగా విజయనగరం జట్టు రన్నర్‌గా నిలిచింది. తృతీయ స్థానాన్ని శ్రీకాకుళం జట్టు దక్కించుకుంది. విజేతలకు పతకాలు బహూకరించడంతోపాటు సర్టిఫికెట్లు అందజేశారు. విన్నర్‌, రన్నర్‌ స్థానాల్లో నిలిచిన జట్లకు గోల్డ్‌కప్‌లు అందజేశారు. అనంతరం జాతీయ స్థాయిలో జరిగే బేస్‌బాల్‌ పోటీలకు అండర్‌ 17 బాల బాలికల రాష్ట్ర జట్లను ఎంపిక చేసినట్లు టోర్నమెంట్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పేరం మస్తాన్‌ రెడ్డి తెలిపారు. విజేతలకు రాష్ట్ర పాఠ్యపుస్తక డైరెక్టర్‌ కె.రవీంద్రనాథ్‌రెడ్డి, బేస్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా చైర్మన్‌ తాళ్ళ వెంకటేష్‌ యాదవ్‌, గ్రామ సర్పంచి వేల్పుల శ్రావణిలు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నంబూరు తిరుపతిరావు, పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ కె.నాగజ్యోతి, టోర్నమెంట్‌ పరిశీలకులు హృదయ రాజు, జయరావు, జగదీశ్వర్‌రెడ్డి, ఎస్‌.వెంకట్‌రెడ్డి, స్పోర్ట్స్‌ మేనేజర్లు, వ్యాయామోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

అండర్‌ –17 బాలుర విభాగంలో

విజేత గుంటూరు, రన్నర్‌ శ్రీకాకుళం

బాలికల విభాగంలో

విన్నర్‌ ప్రకాశం, రన్నర్‌ విజయనగరం

Advertisement
 
Advertisement