న్యూస్‌రీల్
24 గంటల పర్యవేక్షణ
పట్టణ సేవలకు 1929
శుక్రవారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2026
ఆక్వాన్ ముప్పు..
● 20న మధ్యాహ్నం నర్సాపూర్
● పూరీ మధ్య తీరం దాటే అవకాశం
● 47 వేల మందికి పైగా తరలింపు
భువనేశ్వర్: తీవ్ర తుఫాన్ ‘ఆక్వాన్’ ముప్పును ఎదుర్కొనేందుకు ఒడిశా ప్రభుత్వం సమగ్ర సన్నద్ధత చేపట్టింది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ రాష్ట్ర ప్రత్యేక సహాయ కమిషనర్ (ఎస్‌ఆర్‌సీ) కంట్రోల్ రూమ్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, ‘జీరో క్యాజువాలిటీ’ లక్ష్యంగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కొండల దిగువ, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆక్వాన్ నవంబర్ 20న మధ్యాహ్నం ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపూర్–పూరీ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావంతో గంటకు 90 నుంచి 100 కిలో మీటర్ల వేగంతో గాలులు, అక్కడక్కడా 110 కిలో మీటర్ల వరకు వేగంతో గాలివానలు వీచే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
రెడ్ అలర్ట్ జిల్లాలు
మల్కన్ గిరి, కొరాపుట్, రాయగడ, కలహండి, గజపతి, గంజాం, కంధమల్, బౌధ్, పూరీ, నయాగఢ్, ఖుర్దా జిల్లాలు. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఇతర జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశముంది.
47 వేల మందికి పైగా తరలింపు
తుఫాన్ ఆశ్రయ కేంద్రాల తరలింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇప్పటివరకు 47 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గంజాం జిల్లాలో అత్యధికంగా 25 వేల మందిని తరలించారు. జగత్‌సింగ్‌పూర్‌లో మరో 11 వేల మందిని తరలించేందుకు గుర్తించారు. వీరందరినీ గురు వారం రాత్రిలోగా సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. 1,313 మంది గర్భిణులను సమీప ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం 448 తుఫాన్ ఆశ్రయ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురాగా, మరో 3,000కుపైగా ఆశ్రయ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు.
74 రక్షణ బృందాలు సిద్ధం
సహాయక చర్యల కోసం 60 ఒడ్రాఫ్, 14 ఎన్ డీఆర్‌ఎఫ్ బందాలు.. మొత్తం 74 బృందాలను రంగంలోకి దించారు. మరో 20 బృందాలను అప్రమత్తంగా ఉంచారు. ఏడు జిల్లాల్లో తుఫాన్ సన్నద్ధత, సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులను పర్యవేక్షించేందుకు ఏడుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించారు. రక్షణ, సహాయక చర్యల కోసం ప్రభుత్వం ముందస్తుగా రూ.20.5 కోట్లను విడుదల చేసింది. గంజాంకు రూ.5 కోట్లు, మరో 15 జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.కోటి చొప్పున, మల్కన్ గిరికి రూ.50 లక్షలు కేటాయించారు.
పాఠశాలలు, అంగన్ వాడీలకు సెలవులు
తుఫాన్ ప్రభావం దృష్ట్యా గంజాం, గజపతి, పూరీ, జగత్‌సింగ్‌పూర్, కేంద్రాపడా, కంధమల్ జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలను నవంబర్ 19 నుంచి 21 వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రధాన లక్ష్యం. తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉంది. జీరో క్యాజువాలిటీనే లక్ష్యం అని ముఖ్యమంత్రి మాఝీ స్పష్టం చేశారు.
రాయగడ, నువాగడలో
అధికారుల పర్యటన
ఎస్‌ఆర్‌సీ కంట్రోల్ రూమ్‌లో నేటి నుంచి అనుభవజ్ఞులైన అధికారులు 24 గంటలూ పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. రెవెన్యూ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరవింద్ పాఢీ ప్రస్తుతం పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో పాము కాటు మందులు, వైద్య కిట్లు, అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉంచారు. విద్యుత్, రహదారులు, నీటి సరఫరా తదితర సేవలను తుఫాన్ అనంతరం వెంటనే పునరుద్ధరించేందుకు ఇంజినీరింగ్ శాఖలను సిద్ధం చేశారు.
తుఫాన్ నేపథ్యంలో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ‘అర్బన్ ఒడిశా కంట్రోల్ రూమ్’ను సక్రియం చేసింది. పట్టణ ప్రాంతాల్లో తుఫాన్ కారణంగా తలెత్తే పౌర సేవల సమస్యలను ప్రజలు 1929 హెల్ప్‌లైన్ కు ఫోన్ చేసి తెలియజేయవచ్చు. నీరు నిలిచిపోవడం, డ్రైనేజీలు మూసుకుపోవడం, చెట్లు కూలిపోవడం, తాగునీటి సరఫరాలో అంతరాయం వంటి సమస్యలను 1929కు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసే సమయంలో వార్డు నంబర్, సమీప గుర్తింపు స్థలం, సమస్య వివరాలను తెలియజేయాలని అధికారులు సూచించారు. తద్వారా సంబంధిత పట్టణ స్థానిక సంస్థలు సమస్యను గుర్తించి వేగంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో సేవల అంతరాయాలను పర్యవేక్షించడంతోపాటు, ప్రజలు, పట్టణ స్థానిక సంస్థల మధ్య సమన్వయంతో అత్యవసర సమస్యలను త్వరగా పరిష్కరించడమే ఈ కంట్రోల్ రూమ్ లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.


