మల్కన్‌గిరి: అధికారిక హోదా కంటే మానవత్వమే గొప్పదని నిరూపించారు మల్కన్‌గిరి సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయ్. గురువారం బిజాఘాటీ సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయాలతో పడివున్న ముగ్గురు ఓఎస్‌ఏపీ జవాన్లను ఆయన స్వయంగా తన వాహనంలో ఒకరికి, మరో ఇద్దరిని అంబులెన్స్ సహయంతో మల్కన్‌గిరి ఆస్పత్రికు తరలించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో విధులు నిమిత్తం సబ్ కలెక్టర్ మత్తిలి వెళ్తున్నారు. అయితే ముగ్గురు ఓఎస్‌ఏపీ నాలుగో బెటాలియన్‌కు చెందిన జవాన్లు మత్తిలిలో విధులు ముగించుకొని మల్కన్‌గిరి బెటాలియన్ క్యాంప్‌కు వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒక జవానుకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రగాయలు పాలైన జవాన్‌ను సబ్ కలెక్టర్ వెంటనే తన వాహనంలో ఎక్కించుకొని ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో ఆయనను అంతా అభినందిస్తున్నారు.
బలిమెల జలాశయంలో నాలుగు గేట్లు ఎత్తివేత
మల్కన్‌గిరి : ఆక్వాన్ తుఫాన్ ముప్పును దృష్టిలో ఉంచుకుని బలిమెల జలాశయంలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో రెండు గేట్లను తెరవగా గురువారం ఉదయం మరో రెండు గేట్లను తెరిచారు. మొత్తం నాలుగు గేట్లు తెరిచారు. ప్రస్తుతం జలాశయం నుంచి ప్రతి సెకనుకు 24,500క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గేట్లు తెరవడానికి ముందుగా సైరన్ మోగించి దిగువ ప్రాంతాల ప్రజలను అధికారు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం జలాశయంలోకి నీటిమట్టం 1,507,41 అడుగులుగా ఉంది. రానున్న వర్షాలు, జలాశయంలోకి చేరే నీటి ప్రవాహాన్ని నిరంతరం పరిశీలిస్తున్నామని, అవసరమైతే మరిన్ని గేట్లను తెరుస్తామని సూపరింటెండెంట్ ఇంజనీర్ కై లాష్ చంధ్ర సేఠి తెలిపారు.
పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ
రాయగడ: వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు సామాజిక భద్రత పింఛన్ల సేవలను మరింత సులభతరం చేయడంతో పాటు పారదర్శకంగా, వేగంగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏకీకృత పెన్షన్ నిర్వహణ పోర్టల్‌ను రాయగడ పురపాలక పరిధిలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తగా పెన్షన్ పథకాల్లో అర్హత పొందిన 380 మంది లబ్ధిదారులకు అతిథుల చేతులమీదుగా మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సామాజిక, భద్రత దివ్యాంగుల సాధికారత విభాగం, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక బిజూ పట్నాయక్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి రాష్ట్రస్థాయిలో ఈ ప్రజా ప్రయోజనకరమైన డిజిటల్ పోర్టల్‌ను ప్రారంభించిన నేపధ్యంలో.. రాయగడ పురపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పి.మహేష్ పట్నాయక్, వైస్ చైర్మన్ శ్రమితా పాడి, సబ్ కలెక్టర్, పురపాలక కార్యనిర్వాహక అధికారి మృణాళిని రాథోడ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అదేవిధంగా జిల్లా సామాజిక భద్రతాధికారి ఎలిజబెత్ గొరడ, సబ్ డివిజనల్ సామాజిక భద్రతాధికారి శ్రీకాంత్ కుమార్ పాణిగ్రహి పాల్గొన్నారు. అందుబాటులోకి వచ్చిన యూపీఎంపీ పోర్టల్ ద్వారా మధుబాబు పెన్షన్ యోజన, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద అందించే అన్ని రకాల పెన్షన్ సేవలు ఒకే డిజిటల్ వేదికపై అందుబాటులోకి వస్తాయని అతిధులు పేర్కొన్నారు. కొత్త విధానం ద్వారా పెన్షన్ మంజూరు, పంపిణీ ప్రక్రియలో పారదర్శకత పెరగడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు సేవలు వేగంగా అందుతాయని వివరించారు.


