● సభ వాయిదా
భువనేశ్వర్: గంజాం జిల్లాలో ఇటీవల సంభవించిన వరదలపై సమగ్ర చర్చ జరపాలని, ఆంధ్రప్రదేశ్‌తో కొనసాగుతున్న కొటియా సరిహద్దు వివాదంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష బిజూ జనతా దళ్, కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఒడిశా అసెంబ్లీలో గురువారం కూడా కార్యకలాపాలు స్తంభించాయి. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన రెండో రోజూ ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగలేదు. ఉదయం 10.30 గంటలకు ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైన వెంటనే బీజేడీ, కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు, బ్యానర్లతో సభ మధ్యలోకి వచ్చి నినాదాలు చేశారు. స్పీకర్ సురమా పాఢి తన స్థానంలో కూర్చోకముందే కొందరు ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి చేరారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముఖేష్ మహాలింగ్ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు స్పీకర్ అనుమతించడంతో ఆందోళన మరింత తీవ్రతరమైంది. కొంతమంది సభ్యులు రిపోర్టర్ల టేబుళ్లపైకి ఎక్కగా, మరికొందరు స్పీకర్ పోడియం కింద నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీపతి స్పీకర్ పోడియంను బాదుతూ నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. బీజేడీ సభ్యులు గంజాం వరదలపై ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ చర్చకు పట్టుబట్టగా, కాంగ్రెస్ సభ్యులు కొటియా సరిహద్దు వివాదాన్ని సభలో చర్చించాలని డిమాండ్ చేశారు.
కేవలం ఏడు నిమిషాలే కార్యకలాపాలు
ఆందోళనల మధ్య సభ కేవలం ఏడు నిమిషాలపాటు మాత్రమే కార్యకలాపాలు నిర్వహించగలిగింది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్పీకర్ తొలుత సభను సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేశారు. దీంతో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ కూడా సజావుగా నిర్వహించలేకపోయారు. సాయంత్రం 4 గంటలకు సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా ప్రతిపక్ష సభ్యుల ఆందోళన కొనసాగింది. కొటియా వివాదం, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంపై ప్రత్యేక చర్చ జరపాలన్న డిమాండ్‌పై బీజేడీ, కాంగ్రెస్ సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో సభను నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో స్పీకర్ శుక్రవారం వరకు వాయిదా వేశారు.
స్పీకర్ అఖిలపక్ష సమావేశం
సభలో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించేందుకు స్పీకర్ సురమా పాఢి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని అన్ని పార్టీలను కోరారు. అయితే వరదలు, కొటియా అంశాలపై చర్చ జరపాలన్న తమ డిమాండ్లను ప్రతిపక్షాలు కొనసాగిస్తున్నాయి. బీజేడీ ఎమ్మెల్యే శారదా ప్రసన్న జెనా మాట్లాడుతూ, సమావేశాలు ప్రారంభం కావడానికి ఒకరోజు ముందే వరదలపై చర్చ కోసం సభా కార్యకలాపాలన్నింటినీ నిలిపివేసి చర్చ చేపట్టాలని కోరుతూ స్పీకర్‌కు నోటీసు ఇచ్చామని తెలిపారు. తమ నోటీసును పట్టించుకోకపోవడంతో సభలో చర్చకు డిమాండ్ చేయడం తప్ప మరో మార్గం లేదన్నారు. ఇలా వరుసగా రెండో రోజూ ప్రతిపక్ష ఆందోళనలతో అసెంబ్లీ కార్యకలాపాలు స్తంభించడంతో కీలక శాసన కార్యక్రమాలు ముందుకు సాగలేదు.


