242 మంది గ్రామస్తుల తరలింపు | - | Sakshi
Sakshi News home page

242 మంది గ్రామస్తుల తరలింపు

Nov 20 2026 2:18 AM | Updated on Nov 20 2026 2:18 AM

రాయగడ: తుఫాను ముప్పును దృష్టిలో పెట్టుకుని జిల్లాలో అధికారులు ముందస్తు అప్రమత్తత చర్యలు చేపట్టారు. జిల్లాలో ఇంకా వర్షాలు లేనప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తగా మూడు సమితులకు చెందిన 242 మంది గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుణుపూర్‌, పద్మపూర్‌, కొలనార సమితుల్లోని ప్రమాదకర ప్రాంతాల ప్రజలను తుఫాన్‌ పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. జిల్లా అత్యవసర విభాగం అందించిన వివరాల ప్రకారం.. గుణుపూర్‌ సమితిలోని కులసింగి గ్రామ పంచాయతీ పరిధిలో 82 మందిని పద్మపూర్‌ సమితి నువాగడ గ్రామ పంచాయతీలోని గొయిబంధ, దుగుడి గ్రామాలకు చెందిన 56 మందిని, కొలనార సమితి ఖేదాపడ గ్రామ పంచాయతీలోని కిరికిండ గ్రామానికి చెందిన 104 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రమాదకర ప్రాంతాల్లో నివసించే ప్రజల ప్రాణాలను కాపాడటం, జీరొ క్యాజువాలిటీ లక్ష్యంగా ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు గుణుపూర్‌ సబ్‌ కలెక్టర్‌ దుదూల్‌ అభిషేక్‌ దిల్లిప్‌ తెలిపారు. తుఫాన్‌ ఆశ్రయ కేంద్రాల్లో ఉంటున్న గ్రామస్తులకు వేడి ఆహారం అందిస్తున్నారా, ఇతర అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారా అనే అంశాలను ఆయన స్వయంగా పరిశీలించారు. అదేవిధంగా ఆహార నాణ్యత, వారి భోజన, వసతి సౌకర్యాలను దగ్గరుండి పరిశీలించారు. జిల్లాలో మొత్తం 148 వరద ముప్పు ప్రాంతాలు, 55 కొండచరియలు విరిగిపడే ప్రమాద ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తు అవసరాన్ని బట్టి మొత్తం 9,107 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. ముఖ్యంగా కొండప్రాంతాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న గ్రామాలు నదీ పరివాహక ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచాలని జిల్లా కలక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి ఇప్పటికే అన్ని సమితుల బీడీఒలు, తహసీల్దార్లను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement