రాయగడ: కన్నతండ్రికి కొడుకే తలకొరివి పెట్టాలనే సంప్రదాయానికి అతీతంగా ఓ కుమార్తె తన తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించి అందరి హృదయాలను కదిలించింది. తండ్రి మరణంతో పుట్టెడు దుఖంలో ఉన్నప్పటికీ, కొడుకు అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెద్ద కుమార్తెగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ తండ్రికి ఆఖరి వీడ్కోలు పలికింది. ఈ హృదయ విదారక ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాయగడకు చెందిన హొటల్ యజమాని మైదా ఉమా మహేశ్వరరావు (71) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కుమారుడు ఆస్ట్రేలియాలో ఉద్యోగ రీత్యా ఉండటంతో తండ్రి మరణవార్త తెలిసినా అంత్యక్రియలకు హాజరుకాలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో గురువారం స్థానిక న్యూకాలనీలో ని ఆయన నివాసంలో వద్ద నిర్వహించిన అంత్యక్రియల్లో పెద్ద కుమార్తె ఆశఽ ముందుకు వచ్చి తండ్రికి తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. స్థానిక సిరిగుడ వద్ద గల స్మశాస వాటికలో ఈ ప్రక్రియను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తండ్రిపై ఉన్న ప్రేమ, గౌరవం, కుటుంబ బాధ్యతను చాటుతూ ఆశ చేసిన ఈ పని పలువురి కళ్లను చెమర్చేలా చేసింది.


