అక్వాన్‌పై అప్రమత్తం..! | - | Sakshi
Sakshi News home page

అక్వాన్‌పై అప్రమత్తం..!

Nov 18 2026 1:26 AM | Updated on Nov 18 2026 1:26 AM

ఉద్యోగుల సెలవులు రద్దు

ముప్పును ఎదుర్కొనేందుకు చర్యలు

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు

తరలించేందుకు ఏర్పాట్లు

అందుబాటులోకి ఎన్డీఆర్‌ఎఫ్‌, ఓడ్రాఫ్‌

బృందాలు

రాయగడ: జిల్లాకు తుఫాన్‌ ముప్పు పొంచివున్న నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు గర్భిణులు, బాలింతల అత్యవసర పరస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖలను సిద్ధం చేసింది. జిల్లా కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి అధ్యక్షతన మంగళవారం జిల్లాస్థాయి అధికారులతో వీడియో కాన్పరెన్స్‌ ద్వారా తుఫాన్‌ సన్నద్ధతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరులో సమావేశంలో జిల్లా యంత్రాంగం చేపట్టిన ముందస్తు చర్యలను వివరించారు.

9,107 మందిని తరలించేందుకు ప్రణాళిక

జిల్లాలోని 148 వరద ముంపు ప్రాంతాలు, 55 కొండచరియలు విరిగిపడే ప్రమాదకర ప్రాంతాలను గుర్తించినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న 9,107 మందిని అవసరాన్ని బట్టి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న గ్రామాలు, నదీ పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని బీడీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. ప్రమాద సూచనలు కనిపించిన వెంటనే ప్రజలను ముందస్తుగా తరలించాలని స్పష్టం చేశారు. జిల్లాలో మూడు బహుళ ప్రయోజన తుఫాన్‌, వరద ఆశ్రయ కేంద్రాలతో పాటు 131 తాత్కాలిక సురక్షిత పునరావాస కేంద్రాలను గుర్తించారు. ఈ కేంద్రాల్లో బాధితులకు ఆహారం, తాగునీరు, విద్యుత్‌ దీపాలు, ఇతర నిత్యావసర సదుపాయాలను కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.

210 మంది గర్భిణుల గుర్తింపు

మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా 210 మంది గర్భిణులను గుర్తించి, అవసరాన్ని బట్టి సమీపంలోని మా గృహాలు, ఆస్పత్రలుకు ముందుగానే తరలించేందుకు చర్యలు చేపట్టారు. బాలింతలు, పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారం, తాగునీరు, వైద్య సేవలు అందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖలను ఆదేశించారు. ఆశా, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్తలు, నిరంతరం వారితో సంప్రదింపులు జరుపుతూ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు.

– నోడల్‌ అధికారుల నియామకం

తుఫాన్‌ సహాయక చర్యల కోసం జిల్లాలో తొమ్మిది మంది నోడల్‌ అధికారులను నియమించారు. గుణుపూర్‌లో మూడు ఓడ్రాఫ్‌ బృందాలు, రాయగడలో ఒక ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని అందుబాటులో ఉంచనున్నారు. అదేవిధంగా 11 అగ్నిమాపక బృందాలను అప్రమత్తం చేశారు. వరదలు, కొండచరియలు, భారీ వర్షాల కారణంగా అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అగ్నిమాపక శాఖను ఆదేశించారు. నీట మునిగిన ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించడం, రహదారులపై కూలిన చెట్లను తొలగించడం వంటి చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. గుణుపూర్‌, గుడారి, కాసీపూర్‌ ప్రాంతాల్లో మూడు ఎస్‌ఆర్‌సీ బోట్లను సిద్ధంగా ఉంచారు. తుఫాన్‌ అనంతరం రహదారులపై రాకపోకలను పునరుద్ధరించేందుకు వ్యూహాత్మక ప్రాంతాల్లో 45 జేసీబీలు, రెండు హైడ్రా క్రేన్లను కూడా అందుబాటులో ఉంచనున్నారు.

నిత్యావసర సరుకుల నిల్వ

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిల్లాలో భారీగా నిత్యావసర సరుకులను నిల్వ చేశారు. దీనిలో 153.57 క్వింటాళ్ల అటుకులు, 107.60 క్వింటాళ్ల బెల్లం, 20,949 బిస్కెట్‌ ప్యాకెట్లు, 8,490 కొవ్వొత్తుల ప్యాకెట్లు, 5,546 అగ్గిపెట్టెల ప్యాకెట్లు, 8,079 లీటర్ల కిరోసిన్‌, 59,132.45 క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. అవసరాన్ని బట్టి వీటిని ప్రమాదకర ప్రాంతాల్లో.. పునరావాస కేంద్రాలకు తరలించనున్నారు.

జలాశయాలపై పర్యవేక్షణ

జిల్లాలోని బడనాల (కేందుగుడ) సాగునీటి జలాశయంలో 69 శాతం, హరభంగి జలాశయంలో 79 శాతం నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రానున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని జలాశయాల నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించాలని జలవనరుల శాఖను ఆదేశించారు. అదేవిధంగా భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున రైతులు వరి, పత్తి తదితర పంటలను పొడిగా ఉండే ఎత్తైన సురక్షిత ప్రాంతాల్లో నిల్వ చేయాలని సూచించారు. అవసరమైతే నీరు చొరబడని కవర్లతో పంటలను కప్పి ఉంచాలని వ్యవసాయ శాఖ ద్వార రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

తుఫాన్‌ ముప్పు నేపథ్యంలో జిల్లా, సబ్‌ డివిజన్‌, సమితి, తహసీల్దార్‌ కార్యాలయాలతో పాటు టీపీఎస్‌ఓడీఎల్‌, అగ్నిమాపక శాఖలో 24 గంటల కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. జిల్లాస్థాయిలోనూ అత్యవసర నియంత్రణ కేంద్రాన్ని అందుబాటులో ఉంచారు. అన్ని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల సెలవులను రద్దు చేసి, విధిగా తమ తమ ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణే ప్రధాన లక్ష్యంగా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా అధికార యంత్రాంగం జారీ చేసే హెచ్చరికలు, సూచనలు పాటించాలని, అవసరమైనప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియకు సహకరించాలని కోరారు.

అత్యవసర సహాయం కోసం

సంప్రదించాల్సిన నంబర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement