పర్లాకిమిడి: గజపతి జిల్లాలో వృద్ధాప్య పింఛన్లు సకాలంలో అందజేయడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని, ఇటీవల అర్నబ్ తుపాను వల్ల కోర్సండ గ్రామంలో పింఛన్ల పంపిణీ ఆలస్యంగా జరిగిందని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి మంగళవారం భువనేశ్వర్‌లో ఒడిశా లెజిస్లేటివ్ అసెంబ్లీ కమిటీ ముందు ప్రశ్నించారు. అలాగే తుపానుకు నష్టపోయిన కోర్సండ గ్రామంలో సుభద్ర పథకం కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒడిశా శాసనసభ కమిటీలో సభ్యులుగా ప్రశాంత బెహరా, ఉమాచరణ్ మల్లిక్, ప్రకాష్ చంద్ర శెఠి, హిమాంశు శేఖర్ సాహు, డా.ఫకీర్ మోహన్ నాయక్, రూపేష్ పాణిగ్రాహి, సత్యజిత్ గొమాంగో, బిజయకుమార్ దళ బెహరా, సుజాతా సాహు తదితరులు ఉన్నారు.
బైక్ రేసింగ్‌లపై అధికారుల కొరడా
రాయగడ: పట్టణంలో అర్ధరాత్రి వేళ జరుగుతున్న బైక్ రేసింగ్‌లు, మైనర్ల నిర్లక్ష్యపు డ్రైవింగ్, మోడిఫైడ్ సైలెన్షర్ల భీకర శబ్ధాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా గుణుపూర్ సబ్ డివిజన్ యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ దిలీప్ ఆదేశాల మేరకు రాయగడ ప్రాంతీయ రవాణా అధికారి, గుణుపూర్ పోలీస్‌స్టేషన్ అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలోని వివిధ రహదారులపై కొందరు మైనర్లు రాత్రి 10 గంటల నుంచి 1 గంట వరకు ద్విచక్ర వాహనాలతో రేసింగ్‌లు నిర్వహిస్తూ, అతివేగంతో నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో రాత్రివేళ పోలీస్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని, ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సబ్ కలక్టర్ తన లేఖలో పేర్కొన్నారు. బైక్ రేసింగ్‌లకు పాల్బడే మైనర్లతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే సంబంధిత వాహనాలను స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేశారు. చేపట్టిన చర్యలకు సంబంధించిన నివేదికను తనకు సమర్పించాలని ఆదేశించారు. మరోవైపు మైనర్లకు వాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపుతున్న తల్లిదండ్రులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన
జయపురం: కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురంచే జయపురం సమితి పంపుణీ గ్రామంలో వివిధ ప్రజా సంక్షేమ పథకాలపై మేఘా అవగాహన అభిజాన్ కార్యక్రమం మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ అధ్యక్షుడు, జిల్లా జడ్జి ప్రదీప్ కుమార్ మహంతి ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన అభిజాన్ కార్యక్రమాన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా 13 ప్రజా సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆలయ వార్షికోత్సవం
పర్లాకిమిడి: కాశీనగర్ బ్లాక్ ఖండవ పంచాయతీ పాలసింగి గ్రామంలో మంగళవారం జరిగిన సంకటమోచన హనుమాన్ మందిరం ప్రథమ వార్షికోత్సవంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణరావు పాల్గొన్నారు. ఆయనతో పాటు ఖండవ పంచాయతీ బీజేపీ నాయకులు రొక్కం సతీష్, మాజీ సర్పంచ్ ఆర్.బాబూరావు, రఘురాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


