జయపురం: జయపురం నియోజకవర్గాన్ని మద్యం ముక్తి ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో మద్యం అమ్మకాలను నిలిపివేయాలని నియోజకవర్గ మహిళలు డిమాండ్ చేస్తూ జయపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీనాక్షి బాహిణీపతి నేతృత్వంలో మంగళవారం నిర్వహించిన ఆందోళనలో వందలాది మంది మహిళలు, మహిళా కాంగ్రెస్ శ్రేణులతో పాటు జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనాక్షి బాహిణీపతి సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. జయపురం ప్రాంతం గతంలో ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయం, ఐక్యత, పవిత్ర వాతావరణానికి ఒక నమూహంగా ఉండేదని, నేడు మద్యం అమ్మకాలు ఏరులై పారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివలన సామాజిక ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన నియోజకవర్గాన్ని మద్యం రహితంగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


