రాయగడ: ఏళ్ల తరబడి తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ దళితవాడ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు సబ్ కలెక్టర్ మృణాళిని రాథోడ్ వాహనాన్ని అడ్డుకున్న ఆ ప్రాంత మహిళలు ఖాళీ బిందెలు, బకెట్లతో రస్తారొకో నిర్వహించారు. దీంతో అధికారుల వాహనాలు కొద్దిసేపు నిలిచిపోయాయి. ఈ ఘటన జిల్లాలోని కాసీపూర్ సమితి కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. కాసీపూర్ సమితిలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి కలెక్టర్, సబ్ కలక్టర్లు వెళ్తుండగా లక్ష్మీ బజార్ సమీపంలో దళితవాడకు చెందిన మహిళలు రోడ్డుపై బిందెలు, బకెట్లతో బైఠాయించి నిరసన తెలిపారు. తమకు తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో అధికారుల వాహనాలు కొంతసేపు రహదారిపైనే నిలిచిపోయాయి. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్తత నెలకొంది. దళితవాడలో నెలకొన్న తాగునీటి సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి పరిష్కారం లభించలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ముగ్గురు జిల్లా కలెక్టర్లను కలిసి తమ సమస్యను వివరించినా కనీస చర్యలు తీసుకోలేదని వాపోయారు. తహసీల్దార్ అనూప్ ఆచర్యా, సంబంధిత శాఖ ఇంజనీర్లు అక్కడికి చేరుకుని వారం రోజుల్లో తాగునీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.


