రాయగడ: మానవ సేవే మాధవ సేవ అనే నినాదాన్ని ఆచరణలో చూపిస్తూ స్థానిక సామాజిక సంస్థ వికల్ప్ మానవీయ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో దీనస్థితిలో తిరుగుతున్న మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆరుగురిని తొలిదశలో గుర్తించి, వారికి అవసరమైన సహాయం అందించాలని సంస్థ నిర్ణయించింది. ఈక్రమంలో రాయగడ కళాశాల సమీపంలో చాలాకాలంగా అపరిశుభ్ర వాతావరణంలో నివసిస్తూ.. మానసిక సమస్యలతో పాటు చర్యవ్యాధితో బాధపడుతున్న ఓ నిరాశ్రయ వ్యక్తిని సంస్థ సభ్యులు గుర్తించి అతడిని చేరదీసి సంరక్షణ అందించారు. చాలాకాలంగా స్నానం చేయని అతడికి ముందుగా స్నానం చేయించి శుభ్రపరిచారు. శరీరంపై ఉన్న గాయాలకు మందులు రాసి, కొత్త దుస్తులు, చెప్పులు అందజేశారు. ఆహారంతో పాటు పండ్లు కూడా ఇచ్చారు. అభాగ్యుడైన ఓ వ్యక్తి జీవితంలో పరిశుభ్రత, ఆరోగ్యం, ఆప్యాయతను నింపడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. వికల్ప్ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ దుస్మంత్ కుమార్ మహంతి నాయకత్వంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించగా సంస్థ కార్యదర్శి జగదీష్ చంద్రదొర సమన్వయం చేశారు. శశిభూషన్ పట్నాయక్, రాజేంద్ర సాహు, గౌరిశంకర్ రావు, మన్మథ తులో, కుముద చంద్ర సామంతరాయ్, రవనారాయణ శతపతి, ఎం హరిప్రసాద్‌రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


