సహాయక ఏర్పాట్లు ముమ్మరం | - | Sakshi
Sakshi News home page

సహాయక ఏర్పాట్లు ముమ్మరం

Nov 18 2026 1:26 AM | Updated on Nov 18 2026 1:26 AM

భువనేశ్వర్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్‌ తుఫాన్‌ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాలు, వరదలు, నీట మునక, రహదారి సంబంధాల అంతరాయం ఏర్పడే అవకాశం ఉండటంతో తాగునీరు, ఆహారం, విద్యుత్‌, వైద్యం, రవాణా, సహాయక చర్యలకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ప్రస్తుత అంచనాల ప్రకారం తుఫాన్‌ నవంబర్‌ 20న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, తుని మధ్య తీరం దాటే అవకాశం ఉండగా, దాని ప్రభావంతో ఒడిశాలోని దక్షిణ, పశ్చిమ జిల్లాల్లో నవంబర్‌ 18 నుంచి వర్షాలు పెరగనున్నాయి.

తాగునీటి సరఫరాకు ప్రత్యేక ప్రణాళిక

పంచాయతీరాజ్‌, తాగునీటి శాఖ రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర తాగునీటి సరఫరా కోసం భారీస్థాయిలో వనరులను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 750 నీటి ట్యాంకర్లు, 860 సింటెక్స్‌ నీటి ట్యాంకులు, 400 డీజీ సెట్లు అందుబాటులో ఉంచారు. తుఫాన్‌ ఆశ్రయాల సమీపంలో ట్యాంకర్లను నిలిపి, రహదారులు నీట మునిగే లేదా రాకపోకలకు వీలు కాని ప్రాంతాలకు సింటెక్స్‌ ట్యాంకులను పికప్‌ వ్యాన్లు, ట్రాక్టర్ల ద్వారా తరలించనున్నారు. ట్యాంకర్లకు నీటిని నింపేందుకు 780 లోడింగ్‌ పాయింట్లను సిద్ధం చేశారు. లోడింగ్‌కు ముందు నీటి వనరులను శుద్ధి చేయడంతోపాటు, తాగునీటి నాణ్యతను పరిశీలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో పంపిణీ కోసం వివిధ ప్రాంతాల్లో 6.8 లక్షల తాగునీటి బాటిళ్లను ఏర్పాటు చేశారు.

24 గంటల కంట్రోల్‌ రూమ్‌లు

రాష్ట్ర, డివిజన్‌, మండల స్థాయిల్లో 24 గంటలూ కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ట్యాంకర్లు, డీజీ సెట్లు, మొబైల్‌ నీటి శుద్ధి యూనిట్లు, బాటిల్‌ వాటర్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ తదితర వనరులు ముందుగానే ప్రభావిత ప్రాంతాలకు చేరేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తుఫాన్‌ అనంతరం రహదారులు దెబ్బతిన్నా నీటి సరఫరా కొనసాగేందుకు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను కూడా గుర్తిస్తున్నారు. తాగునీటి ఏర్పాట్లతోపాటు విపత్తు నిర్వహణ యంత్రాంగాన్ని కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. 60 ఓడ్రాఫ్‌, 14 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కలిపి 74 రెస్క్యూ బృందాలను సున్నిత ప్రాంతాల్లో మోహరించేందుకు సిద్ధం చేశారు. గంజాం, గజపతి, కంధమల్‌, రాయగడ, కొరాపుట్‌, మల్కన్‌గిరి, పూరీ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

గంజాంలో ముందస్తు తరలింపు

దక్షిణ ఒడిశాలోని గంజాం జిల్లాలో కొండలు, కొండ చరియల ప్రమాదం ఉన్న ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. తుఫాన్‌ ఆశ్రయాల్లో కనీసం మూడు నుంచి నాలుగు రోజులపాటు సరిపడా ఆహారం, తాగునీరు, ఇతర నిత్యావసరాలు నిల్వ చేయాలని సూచించింది. ఇప్పటికే 107 మంది గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ప్రభావిత జిల్లాలపై ప్రత్యేక నిఘా

తాజా వాతావరణ అంచనాల ప్రకారం నవంబర్‌ 19న గంజాం, గజపతి, పూరీ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్‌ 20న గంజాం, గజపతి, మల్కన్‌గిరి, కొరాపుట్‌, రాయగడ తదితర దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ అయ్యాయి. తుఫాన్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రాణనష్టం నివారణ, ముందస్తు తరలింపు, సురక్షిత తాగునీరు, అత్యవసర ఆహారం, విద్యుత్‌, రహదారులు, వైద్యం, సమాచార వ్యవస్థల పునరుద్ధరణకు సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అవసరానికి మించి వనరులను ముందుగానే సిద్ధం చేయడమే ఈసారి సన్నద్ధతలో ప్రధాన లక్ష్యంగా అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement