మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజం
వైఎస్సార్సీపీలో 50 కుటుంబాల చేరిక
శ్రీకాకుళం రూరల్ : రాష్ట్రంలో ప్రస్తుతం అన్యాయమైన పాలన కొనసాగుతోందని, ప్రజలకు ఇవ్వాల్సిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పెదపాడులోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం చాపురం డివిజన్‌కు చెందిన మట్టా ఆనంద్ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. చాపురం, గోవిందపురం, సిద్దిపేట గ్రామాలకు చెందిన సుమారు 50 కుటుంబాల వారికి మంత్రి ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం నగర మేయర్ అభ్యర్థి గుండ లక్ష్మిదేవిలు కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ గుండ లక్ష్మిదేవి మన ఇంటి ఆడపడుచు వంటివారని, ఆమెను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రజలను మోసం చేసిన కూటమి పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


