రాయగడ : జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పొతున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు వరకు జిల్లాలో 182 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా 132 మంది మృత్యువాత పడ్డారు. గత ఏడాది ఇదే కాలంలో 203 ప్రమాదాల్లో 125 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ప్రమాదాలు 21 తగ్గినప్పటికీ మరణాలు పెరగడం గమనార్హం. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమాల అమలు, ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణ సహాయం అందించడం లక్ష్యంగా జిల్లా రోడ్డు భద్రతా కమిటీ, జిల్లా హైవే భద్రత కార్యదళ సమావేశం మంగళవారం వర్చువల్ విధానంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్, కమిటీ అధ్యక్షుడు అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాన్ని ప్రాంతీయ రవాణా అధికారి వినయ్ కుమార్ పాల్ నిర్వహించారు. జిల్లాలో రొడ్డు ప్రమాదాల పరిస్థితి , మరణాల సంఖ్య, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, తనిఖీలు, జరిమానాలు, గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు తీరుపై సమీక్షించారు.
ప్రమాదాలు..మరణాలు..
2023 జనవరి నుంచి అక్టోబరు వరకు జిల్లాలో 200 ప్రమాదాలు జరిగి 98 మంది మరణించగా, 2024లో 179 ప్రమాదాల్లో 97 మంది ప్రాణాలు కోల్పొయారు. 2025లో 203 ప్రమాదాలు జరిగి 125 మంది మృతి చెందారు. 2026లో ఇప్పటివరకు 182 ప్రమాదాల్లో 132 మంది మరణించారు. ప్రమాదాల సంఖ్య తగ్గినా మరణాల సంఖ్య పెరగడం రోడ్డు భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సంబంధిత శాఖ అధికారులకు జిల్లా కలక్టర్ కులకర్ణి సూచించారు.
2,555 మంది డ్రైవింగ్ లైసెన్సు సస్పెన్షన్
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు పోలీస్, రవాణా శాఖలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, సీట్‌బెల్ట్ ధరించకపోవడం, అధిక వేగం, మద్యం సేవించి డ్రైవింగ్, అధిక లోడుతొ ప్రయాణం, ట్రిపుల్ రైడింగ్, అక్రమ పార్కింగ్‌పై చర్యలు తీసుకుంటున్నారు. రవాణా శాఖ ద్వారా జనవరి నుంచి అక్టోబరు వరకు 2,250 డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ చేయగా, పోలీస్‌శాఖ ద్వారా 305 లైసెన్సులు సస్పెండ్ చేశారు. రెండు శాఖలు కలిపి మొత్తం 2,255 డ్రైవింగ్ లైసెన్సులు నిలిపివేసినట్లు సమావేశంలో వెల్లడించారు. అక్టోబరులో రవాణా శాఖ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసిన 639మందికి, సీట్‌బెల్ట్ ధరించకుండా డ్రైవింగ్ చేసిన 43 మందికి, మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన 24 మందికి, అధిక లోడుతొ ప్రయాణించిన 33 మందికి, ట్రిపుల్ రైడింగ్ చేసిన 27 మందికి, అక్రమ పార్కింగ్ కు సంబంధించి 25 మందికి చలాన్లు విధించారు.
ప్రమాద ప్రాంతాలపై దృష్టి..
జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టాలని కలక్టర్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ప్రమాద ప్రాంతాల్లో కఠిన తనిఖీలు, మొబైల్ రెస్క్యూ వాహనాల ఏర్పాటు, హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. బిసంకటక్ – దుర్గి రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు చాటికొన నీటి సరఫరా పంపు సమీపంలో హెచ్చరిక బొర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొటగూడ కూడలిలో మలుపులో సూచిక బొర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. మునిగుడ డాన్‌బాస్కొ పాఠశాల, డిగ్రీ కళాశాల, రాజధాని ఢాబా సమీపంలో స్పీడ్ బ్రేకర్లు నిర్మించడంతో పాటు మునిగుడ–తుముడబంధ రహదారిని మరమ్మతు చేయాలని ప్రతిపాదించారు. రాయగడ–కెరడ రహదారిపై గుంతలు పూడ్చడం, సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం, విక్రమపురం కూడలిలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆక్రమణల తొలగింపు..
నో ఎంట్రీ సమయంలో ట్రక్కుల పార్కింగ్ కోసం అమలాభట్ట –తెరువలి , కెరడ–రాయగడ, గుణుపూర్–పర్లాకిమిడి రహదారులపై అనువైన స్థలాలను గుర్తించాలని సంబంధిత పోలీస్ అధికారులు, రవాణా అధికారులు, తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగించారు. రాయగడ–జేకేపూర్ జాతీయ రహదారి 326 పరిధిని పరిశీలించి ఆక్రమణలు తొలగించాలని, కాసీపూర్–సుంగేరు, తెరువలి–బిసంకటక్, తాండికొన కూడలి–శ్యామలాగుడ, బింగి కూడలి రహదారుల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. వంశధార, గుడారి వంతెనల మరమ్మతులు, గుమ్మాఘాటి రహదారి మరమ్మతులు, రహదారులపై క్యాట్స్ ఐ స్టడ్స్ ఏర్పాటు, అక్రమ పార్కింగ్ పై కఠిన తనిఖీలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రమదాల్లో గాయపడిన వారికి సహాయం చేసిన వారిని గుర్తించి సత్కరించాలని కూడా సూచించారు.


