● ఇరు రాష్ట్రాల పోలీసుల తోపులాట
● ఏపీ స్థానిక ఎన్నికల నేపథ్యంలో హడావుడి
● అడ్డుకోవడానికి ఒడిశా ప్రభుత్వం చర్యలు
కొరాపుట్:
కొఠియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కొఠియా పంచాయతీ నేరడి వలస వద్ద ఒడిశా – ఆంధ్రా పోలీసులు మధ్య తోపులాట జరిగింది. కొఠియాలోని 21 గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు చేస్తుండడంతో ఈ వివాదం మరింత పెరిగింది. ఒడిశా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా.. ఆంధ్రప్రదేశ్ పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని ఒడిశా పోలీసుల బారికేడ్లు తొలగించడానికి ప్రయత్నం చేశారు. దీంతో ఒడిశా పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక యువకులతో కలిసి ఈ బారికేడ్లని ఆంధ్ర పోలీసులు తొలగించారు. అనంతరం ఇరురాష్ట్రాల పోలీసులు తోపులాటకి దిగారు. కొరాపుట్ జిల్లా కలెక్టర్ ఫాబీ రషిద్ సంఘటన స్థలానికి చేరుకొని ఆంధ్రా పోలీసులను నిలదీశారు. నేరడి వలసలో ఆంధ్ర ప్రభుత్వం కూడా రెండు ప్లాటూన్ల పోలీసులను మోహరించింది. ముందురోజు కొరాపుట్ జిల్లా కలెక్టర్ సత్యవాన్ మహాజన్ కొఠియా పర్యటించారు. అక్కడ ప్రజలతో మమేకం అయ్యారు. దళారులు మాట నమ్మవద్దని, పోలింగ్‌లో పాల్గొనవద్దని నచ్చజెప్పారు. మరోవైపు ఈ ఘటనపై కలెక్టర్ స్పందిస్తూ కొఠియా ఎల్లవేళలూ ఒడిశాదేనని స్పష్టం చేశారు.
సరిహద్దులో భద్రత కట్టుదిట్టం
భువనేశ్వర్: వివాదాస్పద కొటియా ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కార్యకలాపాలను వ్యతిరేకిస్తూ ఒడిశాలోని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శాంతిభద్రతల పరిరక్షణకు కొటియాలో ఏడు ప్లాటూన్ల పోలీసు బలగాలను మోహరించడంతో పాటు, అంతర్ రాష్ట్ర సరిహద్దు వెంబడి భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి సురేష్ పూజారి మంగళవారం వెల్లడించారు. కొటియా ప్రాంత ప్రయోజనాల పరిరక్షణ కోసం కొరాపుట్ జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి వచ్చాయని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంబంధిత కార్యకలాపాలను స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. పోలింగ్ రోజున ఈ నిరసనలో భాగంగా స్థానికులు, రాజకీయ ప్రతినిధులు, సామాజిక సంస్థల సభ్యులు కొటియాలో పాల్గొనే అవకాశముందని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా రాష్ట్ర యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. ఏడు ప్లాటూన్ల పోలీసు బలగాల మోహరింపుతో పాటు సరిహద్దు వెంబడి చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, ఉన్నతాధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వివరించారు.
సుప్రీంకోర్టులో న్యాయపోరాటం
కొటియా వివాదానికి సంబంధించిన న్యాయపరమైన పరిణామాలను కూడా మంత్రి వివరించారు. ఈ సమస్యపై అప్పటి ఒడిశా ప్రభుత్వం 1968లో సుప్రీంకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. 2010లో ఆ కేసులో ఓటమి ఎదురైన అనంతరం, గత ప్రభుత్వం 2021లో కోర్టు ధిక్కరణ ఆరోపణలతో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిందని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రస్తుత ప్రభుత్వం కూడా మరో పిటిషన్ దాఖలు చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఇతర పరిపాలనా అధికారులపై సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసినట్లు పూజారి వెల్లడించారు. ఏపీ చర్యలు రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే ప్రయత్నంగా అభివర్ణించారు. న్యాయపరంగా తమ వాదనను మరింత బలోపేతం చేసేందుకు, ఈ వ్యవహారాన్ని చట్టపరమైన మార్గాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నట్లు తెలిపారు. కొరాపుట్ జిల్లాలో ఒడిశా – ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వెంబడి ఉన్న కొటియా ప్రాంతం రెండు రాష్ట్రాల మధ్య దశాబ్ధాలుగా కొనసాగుతున్న భూభాగ వివాదానికి కేంద్రంగా ఉంది.
బియ్యం వాహనాలు వెనక్కి
ఆంధ్రప్రదేశ్ నుంచి బియ్యం తీసుకొస్తున్న వాహనాలను స్థానికులు వెనక్కి పంపించినట్లు సమాచారం అందిందని మంత్రి తెలిపారు. కొఠియా ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన పొరుగు రాష్ట్ర అధికారులను సైతం స్థానికులు వెనక్కి పంపించినట్లు పేర్కొన్నారు. ఇటీవల అర్నబ్ తుఫాన్ సమయంలో ఒడిశా ప్రభుత్వం తమకు అండగా నిలిచిన తీరును కొటియా ప్రజలు ప్రత్యక్షంగా చూశారన్నారు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కొటియా ప్రాంతంలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిందని గుర్తుచేసిన పూజారి, ఈసారి మాత్రం వివాదాస్పద ప్రాంతానికి వెలుపల, ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.


