జయపురం: జయపురం సబ్ కలెక్టర్ శుభ్రపండ జయపురం మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారిగా బాధ్యతలను మంగళవారం చేపట్టారు. ఆమె సబ్ కలెక్టర్ బాధ్యతలతో పాటు మున్సిపాలిటీ కార్యనిర్వాహక బాధ్యతలను అదనంగా నిర్వహిస్తారు. ప్రస్తుత అదనపు కార్యనిర్వాహక అధికారి పూజ రౌత్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.
దుకాణాలపై అధికారుల దాడులు
పర్లాకిమిడి: బ్యాన్ చేసిన ప్లాస్టిక్ సంచులు వినియోగిస్తున్న దుకాణాలపై పట్టణంలో మున్సిపల్ అధికారులు దాడులు చేశారు. పలు మెడికల్ షాపుల్లో వినియోగిస్తున్న ప్లాస్టిక్ సంచులను పుట్టుకొని జరిమానా విధించారు. దీనిపై కొందరు వ్యాపారులు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. మూడు రోజుల క్రితం పట్టణంలో పబ్లిక్‌లో ప్రచారం చేపట్టామని పురపాలక సంఘం హెల్త్ ఆఫీసర్ వెంకట్రావు స్పష్టం చేశారు. దాడుల్లో పోలీసులతో పాటు పురపాలక సిబ్బంది పాల్గొన్నారు.
హత్య కేసులో ఐదుగురు అరెస్టు
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి పోటేరు నదిలో వారం రోజుల క్రితం ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైన విషయం విధితమే. అయితే అది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా హత్యగా నిర్ధారణ అయ్యింది. మృతుడు కలిమెల సమితి బాడ్లి పంచాయతీ కుటుగూడ గ్రామానికి చెందిన సోమా పడియమి (67)గా గుర్తించారు. అతడిని అదే గ్రామానికి చెందిన ఐదుగురు కలిసి పాత కక్షలతో హత్యచేసి నదిలో విసిరినట్లు తెలుసుకొని, వారిని కలిమెల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో భీమా పడియమి, కామా పడియమి, దేవమాడి, మాతామాడి, బుడా మడ్కమిలు ఉన్నారు. వైద్య పరీక్షలు అనంతరం నిందితులను కోర్టుకు తరలిస్తామని కలిమెల ఐఐసీ ప్రభుదత్త బిశ్వల్ తెలిపారు.


