అక్రమంగా గ్రానైట్‌ అన్వేషణ..? | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా గ్రానైట్‌ అన్వేషణ..?

Nov 2 2026 2:11 AM | Updated on Nov 2 2026 2:11 AM

రాయగడ: గ్రానైట్‌ ఖనిజ అన్వేషణ పేరుతో కొండను తవ్వుతూ వందలాది విలువైన వృక్షాలను నరికి వేస్తున్న ప్రైవేట్‌ సంస్థ కార్యకలాపాలపై స్థానిక గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి, అధికారుల అనుమతులు లేకుండానే పనులు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని బిసంకటక్‌ సమితి పరిధి సహాడ పంచాయతీ కేంద్రానికి సమీపంలోని కొండపై ఈ వ్యవహారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సహాడ గ్రామ సమీపంలోని కొండపై ఎంఎన్‌ ఎంఎంపీఎల్‌ పేరు కలిగిన ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ గ్రానైట్‌ ఖనిజ నిక్షేపాలు అన్వేషణ చేపట్టింది. దీనిలో భాగంగా భారీ యంత్రాలతో కొండపైకి రహదారులు నిర్మించిడంతో పాటు, పెద్దపెద్ద బోర్లు వేసి భూగర్భం నుంచి గ్రానైట్‌ రాతి నమూనాలను సేకరిస్తోంది. అయితే ఈ పనుల కోసం జేసీబీలతో కొండను తవ్వడంతో పాటు అక్కడ ఉన్న విలువైన చెట్లను సైతం కూల్చివేస్తూ పర్యావరణానికి తీవ్రనష్టం కలిగిస్తోందని గ్రామస్తులు ఆరోపించారు. సంస్థ చేపడుతున్న పనులను గ్రామస్తులు పలుసార్లు వ్యతిరేకించినప్పటికీ , నిర్వాహకులు వారి అభ్యంతరాలను పట్టించుకోలేదు. పనులకు సంబంధించిన అనుమతి పత్రాలను సైతం చూపించలేదని స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు బిసంకటక్‌ తహసీల్దార్‌ కె.వెంకటేశ్వర్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

అధికారుల పరిశీలన

ఈ నేపధ్యంలో తహసీల్దార్‌ శనివారం మధ్యాహ్నం క్షేత్రస్థాయికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. సంస్థ ప్రతినిధులను విచారించడంతో పాటు గ్రానైట్‌ నమూనాల సేకరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి పొందినట్లు చెబుతున్న అనుమతి పత్రాలను పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఖనిజ అన్వేషణ చేపట్టే ప్రాంతానికి సంబంధించి స్థానిక ప్రజా ప్రతినిధులు, తహసీల్దార్‌, కలెక్టర్‌, గనుల శాఖ అధికారులకు ముందస్తు సమాచారం అందించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ నిబంధనలను సంస్థ పాటించలేదని గ్రామస్తులు ఆరోపించారు. అంతేకాకుండా సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చామని సంస్థ సైట్‌ ఇన్‌చార్జి చెబుతున్నప్పటికీ , తమకు ఈ అన్వేషణ గురించి ఎలాంటి సమాచారం లేదని తహసీల్దార్‌ స్పష్టం చేశారు. దీంతో అసలు ఏ శాఖ అనుమతితో కొండపై తవ్వకాలు చేపట్టారు.. అధికారులకు సమాచారం ఇవ్వకుండా నే ఇంతకాలం పనులు ఎలా కొనసాగించారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు సామాన్య గిరిజనులు వంట చెరుకు కోసం అడవిలో చెట్టు నరికినా అటవీ శాఖ అధికారులు కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తుంటారని, అలాంటిది ఒక ప్రైవేట్‌ సంస్థ వందలాది విలువైన చెట్లను ధ్వంసం చేస్తున్నా ఆ శాఖ ఎందుకు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఎంఎన్‌ ఎంఎంపీఎల్‌ కంపెనీ పేరుతో తవ్వకాలు

తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన సహాడ గ్రామస్తులు

అనుమతులు లేవని తహసీల్దార్‌

స్పష్టీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement