రాయగడ: ఎస్‌ఐఆర్‌పై దుష్ప్రచారం తగదని బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి విపక్ష పార్టీల తీరుపై మండిపడ్డారు. ఆదివారం ఆమె రాయగడలో పర్యటించి బిజూ పట్నాయక్ ఆడిటోరియంలో ప్రత్యేకంగా నిర్వహించిన మేధావుల చర్చాగోష్టిలో పాల్గొని మాట్లాడారు. సర్ విషయంలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్‌పై వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలపై ఉందిన పేర్కొన్నారు. దేశంలో ఇప్పటివరకు 12సార్లు సర్ ప్రక్రియ జరిగిందని వివరించారు. అందులో 10 సార్లు కాంగ్రెస్ పాలనలోనే జరిగిందని వెల్లడించారు. గతంలో కూడా సర్ జరిగినప్పటికీ.. అప్పుడు బీజేడీ ఎన్నికల్లో గెలిచి ఓట్లను దొంగిలించిందా అని ప్రశ్నించారు. ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ) పదవి నుంచి తొలగించాలంటూ రాహుల్ గాంధీ చేసిన డిమాండ్లపై కూడా పురంధరేశ్వరి ఘాటుగా స్పందించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నియమాక ప్రక్రియలో ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి, ప్రతిపక్ష నాయకుడు భాగస్వాములుగా ఉంటారని వివరించారు. సర్ అంశానికి బీజేపీ రాజకీయ రంగు పులమడం లేదని, ప్రతిపక్ష పార్టీలే ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వివాదాస్పదం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని బీజేపీ కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి ఆనంద్, బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు రజిత కొరాడ, పెంట కల్యాణి తదితరులు పాల్గొన్నారు.


