ఐపీఎస్ అధికారుల
భువనేశ్వర్:
ఒడిశా హోంశాఖ పలువురు ఐపీఎస్, ఓపీఎస్ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పలువురు అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించడంతో పాటు, మరికొందరికి అదనపు బాధ్యతలు కేటాయించింది. 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, జైళ్లు, దిద్దుబాటు సేవల డైరెక్టర్ జనరల్ సుశాంత కుమార్ నాథ్‌ను హోంశాఖ ఓఎస్డీగా నియమించారు. 1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, భువనేశ్వర్‌లోని రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్) డైరెక్టర్ డాక్టర్ సంతోష్ బాలాకు జైళ్లు, దిద్దుబాటు సేవల అదనపు డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ కటక్‌లోని ఒడిశా రవాణా కమిషనర్‌గా కొనసాగనున్నారు. అదే బ్యాచ్‌కు చెందిన ఎస్‌ఏపీ అదనపు డీజీ రాజేష్ కుమార్‌కు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కేంద్ర డిప్యుటేషన్ నుంచి తిరిగి వచ్చిన 2010 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సారా శర్మను విజిలెన్స్ డీఐజీగా నియమించారు. ఝార్సుగుడ ఎస్పీగా పనిచేస్తున్న 2019 బ్యాచ్ ఐపీఎస్ అధికారి గుండాల రెడ్డి రాఘవేంద్రను కటక్‌లోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏఐజీగా నియమించారు. నువాపడా ఎస్పీగా ఉన్న 2021 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అమృత్‌పాల్ సింగ్‌ను రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీగా నియమించారు. ఖుర్దా అదనపు ఎస్పీగా పనిచేస్తున్న 2022 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి సోనాలి సింగ్ పర్మార్‌ను ఝార్సుగుడ ఎస్పీగా బదిలీ చేశారు. కటక్‌లోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏఐజీగా పనిచేస్తున్న ఓపీఎస్ అధికారి తపన్ నారాయణ రథ్‌ను నువాపడా ఎస్పీగా నియమించారు.
విద్యాధర్ పాత్రోకి నివాళి
పర్లాకిమిడి: సీపీఐఎంఎల్(లిబరేషన్) పార్టీ గజపతి జిల్లా కార్యదర్శి విద్యాధర్ పాత్రో (80) శనివారం మృతి చెందారు. దీంతో ఆయన సంతాప సభ గురండి గ్రామంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యాధర్ పాత్రో విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు భావాజాలంతో చురుకుగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. విద్యాధర్ పాత్రో మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనిలోటు అని సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు మద్దిల మల్లేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో నీలమణి పాత్రో, శ్రీనివాస బెహరా తదితరులు పాల్గొన్నారు.


