తుఫాన్‌కు ముందే కోతలు పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

తుఫాన్‌కు ముందే కోతలు పూర్తి చేయండి

Oct 26 2026 3:16 AM | Updated on Oct 26 2026 3:16 AM

భువనేశ్వర్‌: ముంచుకొస్తున్న తుఫాన్‌, భారీ వర్షాల ముప్పు నేపథ్యంలో 80 నుంచి 85 శాతం వరకు పరిపక్వత చెందిన వరి, మొక్కజొన్న, రాగులు తదితర పంటలను ముందుగానే కోసి సురక్షితంగా నిల్వ చేసుకోవాలని ఒడిశా రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్‌ పూజారి రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రతికూల వాతావరణం వల్ల పంట నష్టాన్ని తగ్గించేందుకు వ్యవసాయ శాఖ, ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఓయూఏటీ) పరిశోధకుల సూచనలను పాటించాలని కోరారు. తుఫాన్‌ ముప్పును ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలను ముమ్మరం చేసిందని ఆదివారం తెలిపారు.

దక్షిణ జిల్లాల్లో హై అలర్ట్‌

తుఫాన్‌ ప్రభావంతో దక్షిణ ఒడిశాలోని గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్‌, మల్కన్‌గిరి జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున హై అలర్ట్‌ ప్రకటించారు. ఈ ఐదు జిల్లాల్లో అక్టోబర్‌ 28, 29 తేదీల్లో పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేయనున్నారు. ఇతర తీర ప్రాంత జిల్లాల్లోనూ వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

30 విపత్తు సహాయక బృందాల మోహరింపు

అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఐదు జిల్లాల్లో మొత్తం 24 ఒడిశా విపత్తు త్వరిత కార్యాచరణ దళం (ఓడీఆర్‌ఏఎఫ్‌), ఆరు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎనన్‌డీఆర్‌ఎఫ్‌) బృందాలను మోహరించారు. వీటిలో గంజాంలో 9 ఓడీఆర్‌ఏఎఫ్‌, 2 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, గజపతిలో 6 ఓడీఆర్‌ఏఎఫ్‌, ఒక ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం ఉన్నాయి. రాయగడ, కొరాపుట్‌, మల్కన్‌గిరి జిల్లాల్లో ఒక్కోచోట 3 ఓడీఆర్‌ఏఎఫ్‌, ఒక ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని అందుబాటులో ఉంచారు.

ప్రాణనష్టం నివారణే లక్ష్యం

తుఫాన్‌ సమయంలో ప్రాణనష్టం జరగకుండా చూడ టమే లక్ష్యంగా ప్రమాదకర ప్రాంతాల్లోని తుఫాన్‌ ఆశ్రయ కేంద్రాలను అవసరమైన సదుపాయాలతో సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గర్భిణులను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను ప్రారంభించారు.

ఐదు జిల్లాలకు ఐదుగురు ఐఏఎస్‌ అధికారులు

తుఫాన్‌ అనంతరం సహాయక, పునరావాస, పునరుద్ధరణ చర్యలను సమర్థంగా చేపట్టేందుకు జిల్లా యంత్రాంగాలకు సహకరించేలా ఒడిశా ప్రభుత్వం ఐదు జిల్లాలకు ఐదుగురు ఐఏఎస్‌ అధికారులను నియమించింది. ఒడిశా రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ (ఓఎస్‌సీఎస్‌సీ) లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె. సుదర్శన్‌ చక్రవర్తిని రాయగడ జిల్లాకు, ఎస్టీ, ఎస్సీ అభివృద్ధి, మైనారిటీలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్‌ పోమా టుడును కొరాపుట్‌ జిల్లాకు నియమించారు. ఆరో గ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి బిజయ్‌ కుమార్‌ దాస్‌ గజపతి జిల్లా యంత్రాంగానికి సహకరించనున్నారు. క్రీడల డైరెక్టర్‌ డాక్టర్‌ యెద్దుల విజయ్‌ను మల్కన్‌గిరి జిల్లాకు, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి డాక్టర్‌ మహేశ్వర్‌ స్వంయిని నబరంగ్‌పూర్‌ జిల్లాకు కేటాయించారు. ఆయా జిల్లాల్లో తుఫాన్‌ సన్నద్ధత, సహాయక చర్యల సమన్వయంలో వీరు కీలక పాత్ర పోషించనున్నారు.

జలాశయాల్లో అదనపు నిల్వ సామర్థ్యం

భారీ వర్షాల సమయంలో జలాశయాల్లోకి చేరే నీటిని నిర్వహించేందుకు పలు ఆనకట్టల నుంచి నీటిని విడుదల చేసే చర్యలను జలవనరుల శాఖ చేపట్టింది. జలాశయాల్లో అదనపు నిల్వ సామర్థ్యం కల్పించడంతోపాటు నదుల్లో పెరిగే వరద ప్రవాహాన్ని నియంత్రించి పరిసర ప్రాంతాలకు ముంపు ముప్పును తగ్గించడంపై అధికారులు దృష్టి సారించారు.

రైతులకు మంత్రి సురేష్‌ పూజారి విజ్ఞప్తి

దక్షిణ ఒడిశాలో హై అలర్ట్‌

30 సహాయక బృందాలు మోహరింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement