డుడాలో రూ.1.09 కోట్ల నిధుల గోల్‌మాల్‌ | - | Sakshi
Sakshi News home page

డుడాలో రూ.1.09 కోట్ల నిధుల గోల్‌మాల్‌

Oct 26 2026 3:16 AM | Updated on Oct 26 2026 3:16 AM

రాయగడ: జిల్లా పట్టణాభివృద్ధి సంస్థ (డుడా) కార్యాలయంలో ప్రభుత్వ నిధులకు సంబంధించిన రూ.1.09 కోట్ల ఆర్థిక అక్రమాల కేసు కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ ) దర్యాప్తు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే కేసు నమోదై నెలలు గడుస్తున్నా ప్రధాన నిందితుడిని అరెస్టు చేయడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జిల్లా పోలీస్‌ యంత్రాంగం ఈఓడబ్ల్యూ దర్యాప్తునకు సిఫార్సు చేసినట్లు సమాచారం. కేసును సమీక్షించిన అనంతరం త్వరలోనే ప్రత్యేక దర్యాప్తు బృందం రాయగడకు వచ్చి విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ఇంత భారీ మొత్తంలో నిధులు దుర్వినియోగం కావడం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాధారణ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి స్థాయిలో పనిచేసే వ్యక్తి ఇంతటి ఆర్థిక లావాదేవీలను ఎలా నిర్వహించగలిగారన్న ప్రశ్నలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ అక్రమాల వెనుక మరెవరైనా ఉన్నారా, విధుల నిర్వహణలో పర్యవేక్షణ లోపాలు చోటు చేసుకున్నాయా.. ఉన్నతాధికారుల పాత్ర ఏమైనా ఉందా.. అన్న అంశాలపై ఈఓడబ్ల్యూ దర్యాప్తుతో స్పష్టత వచ్చే అవకాశముంది.

ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక తీవ్ర ఆరొపణలు

ఈ వ్యవహారంపై రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక గతంలో తీవ్రంగా స్పందించారు. ఉన్నతాధికారుల సహాకారం లేదా అండదండలు లేకుండా ఒక సాధారణ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి ఇంతటి భారీ ఆర్థిక బాధ్యతలు అప్పగించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కోట్లాది రూపాయల నిధుల బదిలీ వెనుక విభాగంలోని ఉన్నత స్థాయి అధికారుల ప్రమేయం ఉండే అవకాశాన్ని పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. కేవలం సాధారణ పోలీసు దర్యాప్తుతో సరిపెట్టకుండా, ఆర్థిక నేరాల విభాగంతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

నిందితుడి ఖాతాలోకి నిధుల బదిలీ

విభాగీయ విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. డుడా కార్యాలయంలో మేనేజ్‌మెంట్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ సిస్టమ్‌ (ఎంఐఎస్‌), అకౌంటెంట్‌ బాధ్యతలు నిర్వహించిన ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి వినయ్‌ హరిజన్‌ నకిలీ సంతకాలు, మోసపూరిత పద్ధతుల ద్వారా రూ.1.09 కోట్ల ప్రభుత్వ నిధులను తన బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో వీధి దీపాలు,ఎల్‌ఈడీ టీవీల నిర్వహణ బాధ్యతలను కూడా ఆయన పర్యవేక్షించేవారని సమాచారం. ఈ వ్యవహారం గత జూలై 10 వతేదీన వెలుగులోకి వచ్చింది. తొలుత సమారు పది లక్షల మేర అక్రమాలు జరిగినట్లు భావించినప్పటికీ తదుపరి పరిశీలనలో మొత్తం రూ.1.09 కోట్లకు చేరినట్లు వెల్లడైంది. ఘటన వెలుగులోకి వచ్చిన ఎనిమిది రోజుల తర్వాత జూలై 18 న డుడా కార్యాలయ అధికారులు రాయగడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు క్రిమినల్‌ కేసు కింద నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా డుడా కార్యాలయం నుంచి కేసుకు సంబంధించిన పలు పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే, నిధుల బదిలీ జరిగి చాలా కాలం గడిచినా అరెస్టు చేయడంలో పురొగతి లేకపొవడంతో కేసును ఈఓడబ్ల్యూ దర్యాప్తునకు అప్పగించాలనే నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఉన్నత స్థాయి విచారణతోనే

అసలు విషయం వెలుగులోకి..

ఈ కేసుపై స్పందించిన జిల్లా ఎస్పీ రాజ్‌ ప్రసాద్‌.. మాట్లాడుతూ భారీ మొత్తంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిన నేపథ్యంలో ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తునకు సిఫార్సు చేసినట్లు తెలిపారు. మరుసటి రోజు కేసును సమీక్షించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ వ్యవహారం పై విజిలెన్స్‌ విచారణ జరగవచ్చన్న చర్చలు కూడా సాగినప్పటికీ, ప్రస్తుతం ఈఓడబ్ల్యూ దర్యాప్తునకు సిఫార్సు చేయడం కీలక పరిణామంగా మారింది. ప్రభుత్వ నిధుల పరిక్షణ, ప్రజా ధనానికి జవాబుదారీతనం, అధికారుల విధుల నిర్వహణలో పారదర్శకత వంటి అంశాల దృష్ట్యా ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement