జగన్నాథుని దర్శనం సులభం | - | Sakshi
Sakshi News home page

జగన్నాథుని దర్శనం సులభం

Oct 26 2026 3:16 AM | Updated on Oct 26 2026 3:16 AM

● శ్రీ మందిరంలో ర్యాంప్‌,

రెయిలింగ్‌ల ఏర్పాటు పూర్తి

● త్వరలో ప్రత్యేక దర్శన విధానం

● ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు అవకాశం

భువనేశ్వర్‌: జగతి నాథుడు శ్రీ జగన్నాథ స్వామిని దర్శించుకోవాలనే భక్తుల ఆకాంక్షకు శారీరక పరిమితులు అడ్డుకాకూడదనే సంకల్పంతో పూరీ శ్రీ మందిరం యంత్రాంగం కీలక ముందడుగు వేసింది. దివ్యాంగ భక్తులు సులభంగా ఆలయంలోకి చేరుకుని స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా ర్యాంప్‌, రెయిలింగ్‌ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. ప్రత్యేక దర్శన విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆలయ ఉత్తర ద్వారం సమీపంలోని గుముట నుంచి కూర్మ ప్రాకారం వరకు ర్యాంప్‌ను నిర్మించారు. భక్తుల రద్దీని నియంత్రించడంతోపాటు భద్రతను కాపాడుతూ, దివ్యాంగులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడం ఈ ఏర్పాట్ల ప్రధాన ఉద్దేశం.

ప్రత్యేక దర్శనానికి కార్యాచరణ ప్రణాళిక

దివ్యాంగ భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని క్రమబద్ధంగా అందించేందుకు శ్రీ మందిరం యంత్రాంగం ప్రత్యేక ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌ఓపీ) రూపొందిస్తోంది. ప్రతిపాదిత విధానం ప్రకారం, అర్హులైన భక్తులను జయ–విజయ ద్వారం సమీపంలోని బహరొ కఠొ (వెలుపలి గడప) వరకు అనుమతించి, అక్కడి నుంచి స్వామివారి దర్శనానికి వీలు కల్పించాలని భావిస్తున్నారు. తొలిదశలో రోజుకు సుమారు 20 మంది దివ్యాంగ భక్తులకు ఈ సదుపాయాన్ని ప్రయోగాత్మకంగా అందించాలని ప్రణాళిక రూపొందించారు. అయితే, ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో ఆలయానికి భక్తుల రాకపోకలు అధికంగా ఉన్నాయి. దీంతో ఈ నెలలో ప్రయోగాత్మక కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. అవసరమైన ఏర్పాట్లు పూర్తయి, విధివిధానాలు ఖరారైన అనంతరం ఈ ప్రత్యేక దర్శన సదుపాయాన్ని ప్రారంభించనున్నారు.

ఆన్‌లైన్‌ బుకింగ్‌.. ప్రత్యేక వలంటీర్లు

ప్రతిపాదిత విధానం అమలుపై పూరీ కలెక్టర్‌, పోలీసు సూపరింటెండెంట్‌, శ్రీ మందిరం నిర్వహణ కమిటీ సభ్యులు, సీనియర్‌ సేవకులు, ఆలయ పరిపాలనాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, భక్తుల వివరాల ధ్రువీకరణ, రిపోర్టింగ్‌, రవాణా మార్గాలు, భద్రతా ప్రమాణాలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. బుకింగ్‌, దర్శన సమయాల కేటాయింపునకు సంబంధించి నిర్వహణ కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు. దివ్యాంగ భక్తులకు అవసరమైన సహాయం అందించడంతోపాటు, నాట్యమండపం లేదా జగమోహన మండపం వైపు సులభంగాా చేరుకునేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన వలంటీర్లను నియమించనున్నారు.

వీల్‌చైర్ల వినియోగంపై పరిశీలన

ఆలయం లోపల సాధారణ వీల్‌చైర్ల వినియోగంపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో, దివ్యాంగ భక్తుల రాకపోకలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన చెక్క లేదా ఇతర వీల్‌చైర్ల వినియోగం, అవసరమైన భక్తులను సహాయకుల ద్వారా తీసుకెళ్లే విధానం వంటి అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రతిపాదిత ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానం ప్రకారం, ఒక్కో దివ్యాంగ భక్తుడు ఏడాదిలో రెండుసార్లు ప్రత్యేక దర్శనం పొందేందుకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. ఈ రెండు దర్శనాల మధ్య కనీసం ఆరు నెలల వ్యవధి ఉండాలన్న నిబంధనను కూడా ప్రతిపాదించారు. దివ్యాంగ భక్తులకు క్రమబద్ధమైన, సౌకర్యవంతమైన దర్శన ఏర్పాట్లు కల్పించాలని ఒడిశా హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో శ్రీ మందిరం యంత్రాంగం ఈ చర్యలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. స్వామివారి దర్శన భాగ్యాన్ని మరింత మందికి అందుబాటులోకి తీసుకురావాలన్న దిశగా ఈ ప్రయత్నం భక్తుల్లో ఆశలు రేకెత్తిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement