నీలమణి దుర్గ ఆలయానికి భక్తుల తాకిడి | - | Sakshi
Sakshi News home page

నీలమణి దుర్గ ఆలయానికి భక్తుల తాకిడి

Oct 26 2026 3:16 AM | Updated on Oct 26 2026 3:16 AM

నీలమణి దుర్గ ఆలయానికి భక్తుల తాకిడి

పాతపట్నం: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం, పాతపట్నం గ్రామదేవత నీలమణిదుర్గ అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. గౌరీ పౌర్ణమి కావడంతో స్థానికులతో పాటు ఒడిశా ప్రాంతానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు, ఘటాలతో మొక్కులు చెల్లించారు. పలువురు వాహన పూజలు చేశారు.

నేటి పీజీఆర్‌ఎస్‌ రద్దు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌ : ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక సోమవారం రద్దు చేసినట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జరగాల్సిన గ్రీవెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అర్జీదారులు గమనించాలని కోరారు.

అమ్మవారికి గాజుల అలంకరణ

టెక్కలి రూరల్‌: గౌరీపౌర్ణమి సందర్భంగా టెక్కలిలోని పట్టు మహాదేవి కోనేరు గట్టుపై లలితా త్రిపురసుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఆదివారం వేలాది గాజులతో అలంకరించారు. ఏటా గౌరీపౌర్ణమి నాడు మట్టి గాజులతో అలంకరించడం ఆనవాయితీగా వస్తోందని ప్రధాన అర్చకులు తర్లా శివకుమార్‌ తెలిపారు.

రేపటి నుంచి రణస్థలం

అగ్రిగోల్డ్‌ బాండ్ల సేకరణ

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాలోని అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేసి వారికి రావాల్సిన డబ్బులు ఇప్పించడమే ధ్యేయమని సీఐడీ డీఎస్పీ కాళిదాస్‌ ఆదివారం స్పష్టం చేశారు. ఈ నెల 27 నుంచి రణస్థలం మండలానికి చెందిన బాధితుల ఒరిజినల్‌ బాండ్లను సేకరిస్తామని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్‌స్టేషన్‌ భవనం పైభాగంలోని ప్రత్యేక కేంద్రానికి బాండ్లు తీసుకురావాలని కోరారు. ఈ నెల 26న ఎల్‌ఎన్‌పేట, జి.సిగడాం మండలాల్లో బాండ్లు స్వీకరిస్తామన్నారు. ఈ నెల 23న 195 మంది బాధితుల నుంచి 406 బాండ్లు, 24న 264 మంది బాధితుల నుంచి 563 బాండ్లు సేకరించినట్లు డీఎస్పీ వివరించారు.

స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షలు వాయిదా

ఎచెర్ల : ఈ నెల 27 నుంచి ప్రారంభం కావాల్సిన డిగ్రీ స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అర్నబ్‌ తుఫాన్‌, స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ యంత్రాంగం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తర్వాత వెల్లడిస్తామని రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.అడ్డయ్య తెలిపారు. తుఫాన్‌ దృష్ట్యా వసతి గృహాల్లో విద్యార్థులకు భోజన వసతి సదుపాయాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అంతర్జాతీయ సదస్సుకు కొప్పలపేట రైతు

జి.సిగడాం: గోవా రాజధాని పనాజీలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరిగిన ప్లాంట్‌ గ్రోత్‌ ప్రమోటింగ్‌ రైజ్‌ బ్యాక్టీరియా 9వ అంతర్జాతీయ సుస్థిర వ్యవసాయ సదస్సుకు జి.సిగడాం మండలం ముషినివలస పంచాయతీ కొప్పలపేటకు చెందిన అభ్యుదయ రైతు బూరాడ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభ్యుదయ రైతు అవార్డును పీజీపీఆర్‌ సంస్థ ప్రదానం చేసింది. ఈ సదస్సుకు అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, జాంబియా తదితర 12 దేశాల శాస్త్రవేత్తలు, విద్యార్థులు, ఆదర్శ రైతులు పాల్గొన్నారు. బ్యాక్టీరియా, సేంద్రియ కర్బనం తదితర అంశాలపై చర్చించినట్లు శ్రీనివాసరావు తెలిపారు.

బంటుపల్లిలో కొట్లాట

రణస్థలం: బంటుపల్లి గ్రామంలో ఆదివారం ఇరువర్గాల వారు కొట్లాటకు దిగినట్లు జె.ఆర్‌.పురం ఎస్సై వి.సత్యనారాయణ తెలిపారు. ఈ ఘటనలో ఒక వర్గానికి చెందిన వెంకటరమణ, సతీష్‌లు రణస్థలంలో సీహెచ్‌సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. గొడవపై విచారణ జరుగుతుందని, స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పోలీస్‌ పికెట్‌ నడుస్తోందని తెలిపారు. జె.ఆర్‌.పురం సీఐ ఎం.అవతారం బంటుపల్లిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. మరో వర్గానికి చెందిన కొంతమందిని పోలీసులు అదుపులోనికి తీసుకుని పైడిభీమవరం సిస్కో పోలీస్‌ స్టేషన్లో విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement