కొఠియాలో కాంగ్రెస్‌ నాయకుల పర్యటన | - | Sakshi
Sakshi News home page

కొఠియాలో కాంగ్రెస్‌ నాయకుల పర్యటన

Oct 26 2026 3:16 AM | Updated on Oct 26 2026 3:16 AM

కొరాపుట్‌: ఆంధ్రా–ఒడిశా వివాదస్పద ప్రాంతం కొఠియాపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రత పెంచింది. కొరాపుట్‌ జిల్లా పొట్టంగి సమితి కొఠియా పంచాయతీలో 21 వివాదాస్పద గ్రామాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్నికల సన్నహాలు పెంచడంతో ఈ సమస్య మరింత జఠిలమైంది. ఈ ఎన్నికలు అడ్డుకుంటామని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ హెచ్చరించింది. కాంగ్రెస్‌ శాసన సభా పక్ష నాయకుడు రామచంద్ర ఖడం నేతృత్వంలో కాంగ్రెస్‌ బృందం కొఠియాలో పర్యటించింది. ఈ బృందంలో ఉన్న పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జయపూర్‌ ఎమ్మెల్యే తారా ప్రసాద్‌ భాహిణీపతి మాట్లాడుతూ ఈ నెల 27న కొఠియాలో కాంగ్రెస్‌ బల ప్రదర్శన చేస్తుందని ప్రకటించారు. ఆ రోజు అధిక సంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు చేరుకుంటారని ప్రకటించారు. దీంతో ఇరు రాష్ట్రాల పొలీసులు అప్రమత్తమయ్యారు. ఈ బృందంలో లక్ష్మీపూర్‌ ఎమ్మెల్యే పవిత్ర శాంత, కొరాపుట్‌ మాజీ ఎంపీ జయరాం పంగి తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ నాయకులతో ఆంధ్రా పోలీసుల వాగ్వాదం..

కొఠియాలో పర్యటిస్తున్న బీజేపీ బృందంతో ఆంధ్రా పోలీసులు వాగ్వాదానికి దిగారు. బీజేపీకి చెందిన కొరాపుట్‌ ఎమ్మెల్యే రఘురాం మచ్చో నేతృత్వంలో బీజేపీ నాయకులు కొఠియాలో ఆంధ్రా ఎన్నికలకు వ్యతిరేకంగా ప్రజలకు అప్రమత్తం చేస్తున్నారు. ఇదే సమయంలో సాలురు పోలీసులు ఎదురయ్యారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. ఇది తమదంటే తమదని వాదించుకున్నారు. ఎన్నికలు జరుగుతున్నందున పర్యటించవద్దని ఆంధ్ర పోలీసులు పేర్కొన్నారు. తమ ప్రాంతంలో ఆంధ్ర పోలీసుల అధికారం ఏంటని ఆ పార్టీ సీనీయర్‌ నాయకుడు సుమంత్‌ ప్రధాన్‌ నేరుగా పోలీసులతో వాదనకి దిగారు. కొంత సేపటికి ఇరువర్గాలు శాంతంగా వెనుతిరిగారు. మరో వైపు రాష్ట్ర మంత్రి సురేష్‌ పూజారి కొఠియాపై సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. గతంలో 2021 వరకు కొఠియాలో ఉన్న ఆంధ్ర పోలీస్‌ స్టేషన్‌ ప్రస్తుతం ఆంధ్రాలో ఉందన్నారు. ప్రస్తుతం కొఠియాపై గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తామని, అందులో అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయన్నారు. ఇటివల ఆంధ్రా ప్రభుత్వం కొఠియాలో సోలార్‌ సెట్లు పంపిణీ చేస్తుండగా తాము అడ్డుకున్నామన్నారు. ఒకే ప్రాంతంలో రెండు రాష్ట్రాలకు చెందిన వార్డు సభ్యులు, సర్పంచ్‌లు ఉండరని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement