జయపురం: జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో 15వ ఒడిశా బెటాలియన్ ఎన్‌సీసీ జయపురం నేటి నుంచి ఈ నెల 26 వ తేదీ వరకు 18 వ సంయుక్త యాన్యువల్ శిక్షణ శిబిరం నిర్వహిస్తోంది. శిబిరంలో విశ్వవిద్యాలయం, వివిధ కళాశాలలు, పాఠశాలల నుంచి 406 మంది ఎస్‌డీ, జేడీ, ఎస్‌డబ్ల్యూ, జేడబ్ల్యూ విభాగాల నుంచి ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. అంతే కాకుండా ఏడుగురు అసోషియేట్ ఎన్‌సీసీ ఆఫిసర్లు (ఏఎన్‌ఓ) కూడా పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్యాంప్ కమాండెంట్ లెఫ్టెనెంట్ కర్నల్ ప్రీతి రంజన్ దాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కేడెట్లకు క్రమశిక్షణ, నిబద్ధత, సమయపాలన, టీమ్ వర్క్, నాయకత్వ లక్షణాలపై అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ క్యాంప్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ కర్నల్ రాకేష్ మిశ్ర, బెటాలియన్ సుబేదార్, సిబ్బంది శిక్షణ తరగతులలో సహకరిస్తున్నారు.
కనకమణి మౌళీ దేవికి ఘనంగా పూజలు
జయపురం: చత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్, ఒడిశా రాష్ట్ర కొట్‌పాడ్ ప్రజల మధ్య భక్తి వారధి కొట్‌పాడ్ దసరాలో ఘనంగా పూజలు అందుకొనే మా కనకమణి మౌళీ దేవి. కొట్‌పాడ్ దసరాలో చేర్‌పూజ ఒక ప్రత్యేకం. పెద్దల కథనాల ప్రకారం చక్రికోట రాణి కాలం నుంచి బస్తర్ రాజుల పాలన వరకు మా కనకమణి మౌళి దేవిని పూజించేవారు. ఈ చారిత్రక దేవీ పూజలు కొట్‌పాడ్–బస్తర్ ప్రజల మధ్య ప్రాచీన సంబంధాలకు ప్రతీక అని నమ్మకం. బస్తర్, కొట్‌పాడ్‌లు నేడు రెండు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ, కనకమణి మౌళీ అమ్మవారిపై ఉన్న భక్తివిశ్వాసం, సాంస్కృతిక సంబంధాలు నేటికీ కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతాల్లో కనకమణి మౌళి అమ్మవారిపై అనేక భక్తి పూర్వక కథలు ప్రజలలో ప్రచారంలో ఉన్నాయి. కనకమణి మౌళి మా దర్శనం కోసం దసరా ఉత్సవాల్లో అనేక గ్రామాల నుంచి భక్తులు కొట్‌పాడ్‌కు వస్తారు. ప్రతి దినం పూజలు సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహిస్తారు. దసరా దినాన మా కనకమణిమౌళీ పీఠం నుంచి భారీ శోభాజాత్ర ప్రారంభమై గ్రామ ఠకురాణి పీఠం వరకు చేరుతుంది.
ఒంధార్‌రొ పరిధి కవితా
సంకలనం ఆవిష్కరణ
భువనేశ్వర్: బర్గఢ్ జిల్లాకు చెందిన కవయిత్రి ప్రవాసిని హత్తా రచించిన ఒంధార్‌రొ పరిధి కవితా సంకలనం, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నవలా రచయిత శాంతను ఆచార్య, ఒడిశా సాహిత్య అకాడమీ మాజీ కార్యదర్శి ప్రొఫెసర్ శశాంక్ చూడామణి, కవయిత్రి జయంతి రథ్, ఫకీర్‌మోహన్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ మోనికా దాస్ హాజరయ్యారు. కవయిత్రి ప్రవాసిని హత్తా మాట్లాడుతు తన కలం మలినాలు లేని మరెన్నో రచనలు ఆవిష్కరించాలని ఆకాంక్షించారు. సమాజంలో విప్లవాన్ని తీసుకువచ్చేది సాహిత్యమే. అందువల్ల, సమాజం ఎల్లప్పుడూ కవులకు, రచయితలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి అని ముఖ్యఅతిథిగా హాజరైన బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.


