బొమ్మల కొలువు.. సంప్రదాయాలకు నెలవు | - | Sakshi
Sakshi News home page

బొమ్మల కొలువు.. సంప్రదాయాలకు నెలవు

Oct 20 2026 4:43 AM | Updated on Oct 20 2026 4:43 AM

● వందేళ్ల నాటి బొమ్మలు.. ● నవరాత్రుల్లో నిత్య సందడి ● ఆధ్యాత్మిక భావాలకు ప్రతిరూపాలు

భువనేశ్వర్‌: దసరా వేడుకలను పురస్కరించుకుని తెలుగింటి లోగిళ్లలో బొమ్మల కొలువులు కొలువుదీరి సందడి చేస్తున్నాయి. రామాయణం సహా పలు పౌరాణిక ఇతివృత్తాలు, పూరీ శ్రీ జగన్నాథుని రథయాత్ర, దశావతారాల వంటి అంశాలతో తీర్చిదిద్దిన ఈ కొలువులు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటుతూ వీక్షకులను మురిపిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో స్థిరపడిన తెలుగు కుటుంబాలు ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులు బంధుమిత్రుల రాకతో కళకళలాడుతున్నాయి. నాలుగు తరాలుగా క్రమం తప్పకుండా బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తూ, వందేళ్లకు పైబడిన బొమ్మలను వారసత్వ సంపదగా కాపాడుకుంటున్న కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆనాటి కళానైపుణ్యానికి, కుటుంబ సంప్రదాయాల పట్ల వారికున్న మమకారానికి ప్రతీకలుగా నిలుస్తున్న ఈ బొమ్మలు భక్తిభావాన్ని, కళాత్మకతను, కుటుంబ అనుబంధాలను చాటిచెబుతున్నాయి.

వందేళ్లకు పైబడిన కొన్ని విగ్రహాలతో రాములవారి పట్టాభిషేక దృశ్యాన్ని బొమ్మల కొలువులో ఏర్పాటు చేయడం విశేషం. భువనేశ్వర్‌లోని పటియా ప్రాంతం మాలతీ రెసిడెన్సీలో నివసిస్తున్న రాజగోపాల్‌ రావు, భారతి కుటుంబ సభ్యులు నాలుగు తరాలుగా ఈ వారసత్వ సంపదను కాపాడుకుంటూ వస్తున్నారు.

శరన్నవరాత్రుల్లో ఏటా బొమ్మల కొలువును ఏర్పాటు చేసి, సంప్రదాయ భావాలను బొమ్మల రూపంలో ప్రతిబింబించడం తమ కుటుంబ ఆచారంగా మారిందని భువనేశ్వర్‌లోని ఆచార్య విహార్‌లో నివసిస్తున్న ఎంపీ ప్రసాద్‌ కుటుంబ సభ్యులు తెలిపారు. బొమ్మల కొలువును తిలకించేందుకు నిత్యం బంధుమిత్రులు, సందర్శకులు తరలివస్తుండటంతో పండుగ వేళ ఇల్లంతా సందడిగా మారుతుందని పేర్కొన్నారు.

దసరా సంబరాల్లో భాగంగా బొమ్మల కొలువుల ద్వారా ఆధ్యాత్మిక, ధార్మిక భావాలను కళాత్మకంగా ఆవిష్కరించడం విశేషమైన సంప్రదాయం. పూర్వీకుల నుంచి అందిపుచ్చుకున్న ఈ ఆచారాన్ని పరిరక్షించడం ద్వారా స్థానికులతో భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరస్పర పరిచయానికి, భావాల మార్పిడికి అవకాశం కలుగుతుందని భువనేశ్వర్‌లోని శైలశ్రీ విహార్‌లో నివసిస్తున్న కామేశ్వరి మరువాడ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement