● ప్రధానమంత్రి మోదీకి ఎంపీ సప్తగిరి లేఖ
రాయగడ: ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్న ఒడిశా రాష్ట్ర రాజ్యాంగ హక్కులు, ఆర్థిక స్వయంప్రతిపత్తి, దీర్ఘకాలిక ప్రయోజనాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యూలేషన్ ) సవరణ చట్టం–2026 , ప్రధానంగా చట్టంలో చేర్చిన సెక్షన్ 9డీపై పునరాలోచన చేయాలని కొరాపుట్ పార్లమెంటు సభ్యుడు సప్తగిరి శంకర్ ఉలక కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బుధవారం లేఖ రాశారు. ప్రస్తుతం ఒడిశాకు ఎంత ఆదాయం వస్తుందన్నది మాత్రమే కాకుండా, భవిష్యత్‌లో రాష్ట్రంలోని ఖనిజ వనరులపై నిర్ణయాలు తీసుకునే అధికారి, వాటి నుంచి ఆదాయం సమీకరించే రాజ్యాంగబద్ధమైన హక్కు ఎవరి వద్ద ఉంటున్నదనే అసలు ప్రశ్న అని లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రాల పన్నుల అధికారంపై ప్రభావం
సెక్షన్ 9డీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం విధించే నిబంధనలు లేదా పరిమితులకు లోబడి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు ఖణిజ హక్కులు లేదా ఖనిజాలు కలిగిన భూములపై పన్ను, సెస్ లేదా ఇతర లెవీలను విధించగల పరిస్తితి ఏర్పడుతుందని ఉలక ఆందోళన వ్యక్తం చేశారు. రాయల్టీ, వేలం ప్రీమియం, జిల్లా ఖనిజ ఫౌండేషన్ (డీఎంఎఫ్) వంటి వాటి ద్వారా రాష్ట్ర ఆదాయం లభిస్తున్నప్పటికీ, భవిష్యత్‌లో రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పన్నులు లేదా ఇతర లేవీలను రూపొందించే స్వేచ్ఛ తగ్గే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు.
అక్రమ మైనింగ్‌పై షా కమిషన్ నివేదిక
జస్టిస్ ఎంబీ షా కమిషన్ ఒడిశాలో ఇనుప, మాంగనీస్ ఖనిజాల అక్రమ తవ్వకాలపై వివరాలను నమోదు చేసిందని, సుమారు 1,59,200 రూపాయల మేర అక్రమాలకు సంబంధించిన ఉల్లంఘనలు ఉన్నట్లు నివేదికలొ పేర్కొన్న విషయాన్ని ఎంపీ ఉలక గుర్తు చేశారు. అలాగే కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2017లో సుప్రీంకోర్టు అవసరమైన చట్టపరమైన అనుమతులు లేకుండా అక్రమంగా తవ్విన ఖనిజాల పూర్తి విలువను వసూలు చేయాలని ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు. కేంఝర్, సుందరఘడ్ వంటి ఖనిజ ప్రభావిత జిల్లాల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, అనేక ప్రభావిత గ్రామాలకు ఇప్పటికీ అవసరమైన మౌలిక వసతులు అందలేదని వివరించారు. గనుల కారణంగా నిర్వాసితులు కావడం, నీటి కాలుష్యం ,అటవీ నష్టం, జీవనోపాధి కోల్పోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజల కోసం డీఎంఎఫ్ నిధులను సమర్ధవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు.
గిరిజన హక్కులకు రక్షణ కల్పించాలి
ప్రత్యేకించి షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనులు భూమి హక్కులు, గ్రామ సభల సమ్మతి, పునరావాసం, పరిహారం వంటి అంశాలపై మరింత పారదర్శకత అవసరమని ఉలక తెలిపారు. భూసేకరణ, పునరావాసం, న్యాయమైన పరిహారం, పాదర్శకతకు
సంబంధించిన 2013 చట్టం, అలాగే పంచాయతీ చట్టం–1996 (పేసా) నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కోరారు. తన నియోజకవర్గమైన కొరాపుట్ గిరిజన ప్రాంతమని, సహజ వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ వాటిపై ఆధారపడిన అనేక మంది ప్రజలు తమ భూమి, అటవీ హక్కుల విషయంలో ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారని ఉలక లేఖలో పేర్కొన్నారు. ఒడిశా నుంచి వెలికితీసే ఖనిజాలు దేశవ్యాప్తంగా పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధికి దోహదపడుతున్నప్పటికీ ఖనిజ ప్రభావిత ప్రాంతాల్లోని సామాజిక, పర్యావరణ, మానవీయ అంశాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
కేంద్రానికి ఎంపీ పలు సూచనలు
సెక్షన్ 9డీ పై పునఃసమీక్ష చేపట్టడంతో పాటు దాని రాజ్యాంగ, ఆర్థిక, పారిశ్రామిక, పర్యావరణ, సమాఖ్య ప్రభావాలను సమగ్రంగా పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అలాగే సెక్షన్ 9డీ కింద నిబంధనలు లేదా పరిమితులు విధించే ముందు ఖనిజ సంపద కలిగిన అన్ని రాష్ట్రాలతో అధికారికంగా సంప్రదింపులు జరపాలని, రాష్ట్రాల వారీగా ఆర్థిక ప్రభా వాల అంచనా నివేదికలను బహిర్గతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఖనిజ ప్రభావిత జిల్లాలపై సవరణ చట్టం ప్రభావానికి సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని, డీఎంఎఫ్ నిధుల వినియోగంలో జవాబూదారీతనాన్ని పెంచాలని, గిరిజనులు, నిర్వాసితుల భూమి సేకరణ, పునరావాస ప్రక్రియల్లో అటవీ హక్కుల చట్టం నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సప్తగిరి శంకర్ ఉలక తన లేఖలో ప్రధాన మంత్రిని కోరారు.


