● పిన్న వయసులో ఘనత
భువనేశ్వర్: చదరంగం క్రీడలో ఒడిశాకు చెందిన చిన్నారి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఘనత సాధించింది. ఒడిశాకు చెందిన 4 ఏళ్ల ఎలెనా మిశ్రా అధికారిక ఫిడే రేటింగ్ సాధించిన అతి పిన్న వయస్కురాలైన మహిళా క్రీడాకారిణిగా చదరంగం క్రీడా ప్రపంచంలో ఒక అద్భుతమైన మైలు రాయిని ఆవిష్కరించింది. ఎలెనా మిశ్రా కేవలం 4 సంవత్సరాల 6 నెలల 16 రోజుల వయస్సులో ఈ రికార్డు సృష్టించడం విశేషం. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో అంతర్జాతీయ చెస్ పాలక సంస్థ ప్రచురించిన రేటింగ్‌ల ప్రకారం కేవలం 4 సంవత్సరాల 6 నెలల 16 రోజుల వయస్సు గల ఎలెనా 1432 బ్లిట్జ్ రేటింగ్‌తో అధికారిక ఫిడే రేటింగ్‌ను పొందిన అతి పిన్న వయస్కురాలైన మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. స్థానిక మదర్స్ పబ్లిక్ స్కూల్‌లో జరిగిన ఒడిశా స్టేట్ బ్లిట్జ్ ఫిడే రేటింగ్ ఓపెన్ చెస్ చాంపియషిప్ 2026లో ఆమె ఈ ఘనతను సాధించింది. ఈ టోర్నమెంట్‌లో ఆమె ప్రతిభ అత్యంత చిన్న వయస్సులోనే ఆమెకు అధికారిక ఫిడే రేటింగ్ జాబితాలో స్థానం సంపాదించి పెట్టింది. ప్రస్తుతం 2022, ఆ తర్వాత జన్మించిన వారిలో ఏ ఫార్మాట్‌లోనైనా అధికారిక ఫిడే రేటింగ్‌ను కలిగి ఉన్న ఏకై క బాలిక, క్రీడాకారిణి ఆమె మాత్రమే కావడం సాధించిన ఘనతకు ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎలీనా మిశ్రా సాధించిన ఈ మైలు రాయి ఘనత ఒడిశాలోని చిన్న పిల్లల్లో చదరంగం పట్ల మరింత ఆసక్తిని కల్పించి జాతీయ, అంతర్జాతీయ చదరంగ పటంలో రాష్ట్రానికి పెరుగుతున్న ప్రాబల్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు.


