పర్లాకిమిడి: ముక్కుడమ్మ మహిళా స్వయం సేవక్ గ్రూపులు సేకరించిన డబ్బులు, మైక్రో ఫైనాన్స్ ప్రైవేటు లిమిటెడ్ అందజేసిన రుణాలు కాజేసి పరారైన సిద్ధకుమార్ అలియాస్ సిద్ధ ఆరాధ్యను హైదరాబాద్‌లో యూసఫ్‌గుడలోని హైలాం కాలనీలో ఒడిశా పోలీసులు అరెస్టు చేసి పర్లాకిమిడి ఎస్‌డీజేఎం కోర్టులో సోమవారం హాజరుపరిచారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక బగాతి వీధికి సమీన్ బేగం జూన్ 11న పోలీసుస్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు సిద్ధకుమార్ మైక్రోఫైనాన్స్, మహిళా స్వయం సహాయక గ్రూపుల వద్ద నుంచి కలెక్షన్ చేసిన బాకీ సొమ్ము రూ.80 లక్షలు, 110 గ్రాముల గోల్డును కోవిడ్ 2019లో కాజేసి పరారయ్యారు. దీంతో మైక్రోఫైనాన్స్ కంపెనీ ప్రెసిడెంట్ ఎ.పద్మారాజ్, దివంగత అనిల్ కుమార్ పాత్రోకు కంపెనీ లావేదేవీలు అన్ని అప్పగించి అమెరికా వెళ్లిపోయారు. దీంతో అకౌంటెట్ సపన్ కుమార్ పాణిగ్రాహి, సిబ్బంది కాళీప్రసాద్ పట్నాయిక్, అశోక్‌కుమార్ మహాపాత్రోలు మైక్రోఫైనాన్స్‌లో మోసం జరిగిందని గమనించి సిధ్ధకుమార్‌పై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదర్శ పోలీసుస్టేషన్‌లో ఐఐసీ ప్రశాంత్ భూపతి, ఇతర సిబ్బంది దర్యాప్తు జరిపి సిద్ధకుమార్‌ను ఎట్టకేలకు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసుల సహకారంతో అరెస్టు చేశారు.


